పాక్ ప్రధానికి జెన్-జెడ్ వణుకు.. బంగ్లా, నేపాల్ తర్వాత పీఓకేనా?
ఇటీవల కాలంలో జెన్-జెడ్ తలచుకుని రెండు దేశాల్లో ప్రభుత్వాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.;
ఇటీవల కాలంలో జెన్-జెడ్ తలచుకుని రెండు దేశాల్లో ప్రభుత్వాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బంగ్లాదేశ్, నేపాల్ లో విద్యార్థుల నిరసనలు ప్రభుత్వాలను తలకిందులు చేసేశాయి! ఈ క్రమంలో తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జెన్-జెడ్ యువత సెగ పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కు గట్టిగా తగులుతుందని అంటున్నారు. ప్రస్తుతం పీఓకే రగిలిపోతోంది.
అవును.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓఖే)లో చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారిన కొన్ని వారాల తర్వాత.. మరోసారి ఆ ప్రాంతంలో కొత్త నిరసనలు వెల్లువెత్తాయి. అయితే.. ఈసారి నిరసనలకు జనరేషన్-జెడ్ నాయకత్వం వహిస్తోంది. ఈ క్రమంలో యువ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపారు. ఈ నిరసనలు గంటగంటకూ తీవ్రమవుతున్నాయని అంటున్నారు.
విద్యా సంస్కరణలు, పెరుగుతున్న ఫీజులు, మూల్యాంకన ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ తాజా జెన్-జెడ్ ఉద్యమం.. ఇప్పుడు ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత నిరసనగా పరిణామం చెందింది. దీంతో బంగ్లాదేశ్, నేపాల్ లో యువత చూపించిన ప్రభావం మరోసారి చర్చకు వచ్చింది.
వాస్తవానికి మొదట్లో ఈ ఉద్యమం శాంతియుతంగానే ప్రారంభమైంది. విద్యార్థులు కేవలం విద్యా సంస్కరణలను డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో గుర్తు తెలియని ఓ దుండగుడు విద్యార్థులపై కాల్పులు జరపడంతో వాతావరణం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. ఈ కాల్పుల్లో ఒక విద్యార్థి గాయపడ్డాడు!
ఇలా పీఓకేలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కాల్పులు జరిగిన తర్వాత వాతావరణం మరింత వేడెక్కింది. నిరసనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. ఇందులో భాగంగా... శాంతియుతంగానే మొదలుపెట్టిన నిరసనకారులు.. టైర్లు తగలబెట్టడం, విధ్వంసం సృష్టించడంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసనలు ఇలా ప్రారంభమయ్యాయి!:
ముజఫరాబాద్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఫీజుల పెరుగుదలపై నిరసించడంతోపాటు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కొనసాగుతున్న విస్తృత నిరసనలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల నిరసనలు తీవ్రతరం కావడంతో, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అన్ని రాజకీయ కార్యకలాపాలను నిషేధించింది.
కాగా... గత ఏడాది జనవరిలోనూ ఇలాంటి నిరసనలే జరిగాయి. ఇందులో భాగంగా... సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతీ క్వార్టర్ ఇయర్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
తెరపైకి బంగ్లాదేశ్, నేపాల్ ఘటనలు!:
నేపాల్ లో యువత నేతృత్వంలోని తిరుగుబాటు జరిగి.. కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల పతనమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత.. పీఓకేలో జెన్ జెడ్ నేతృత్వంలోని నిరసనలు ఆసక్తిగా మారాయి. నేపాల్ జెన్-జెడ్ కోపం నాడు ఏ రేంజ్ లో కనిపించిందంటే.. వారు దాదాపు అందరి మంత్రుల ఇళ్ళు దోచుకుని నిప్పంటించబడటమే కాకుండా, పార్లమెంటునూ కాల్చారు. నాటి నిరసనల్లో కాలిపోయిన వాహనాలను ప్రభుత్వం కేజీల లెక్కన అమ్ముతున్న పరిస్థితి.
ఇక గత ఏడాదిలో బంగ్లాదేశ్ లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా... విద్యార్థులు చేపట్టిన నిరసనలు షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి దారితీశాయి. ఈ నేపథ్యలో.. పాకిస్థాన్ లోని షరీఫ్, మునీర్ ద్వయంపై పెరుగుతున్న తాజా ఆగ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది వేచి చూడాలి.