గ్రీన్‌లాండ్ ఆక్రమణతో నాటో మనుగడకే ముప్పు? అమెరికా-డెన్మార్క్ మధ్య రాజుకున్న చిచ్చు!

అంతర్జాతీయ రాజకీయ యవనికపై గ్రీన్‌లాండ్ అంశం మరోసారి పెను తుపానును సృష్టించింది.;

Update: 2026-01-06 11:11 GMT

‘తా వలచింది రంభ’ అన్నట్టుగా తనకు ఎదురుచెప్పినా.. తన కోరిక తీర్చని అందరినీ వేధించేస్తున్న ట్రంప్ ఇప్పటికే వెనిజులాను ఆక్రమించేశాడు. ఇప్పుడు ఆయన కన్ను డెన్మార్క్ దేశం ఆధీనంలోని గ్రీన్ లాండ్ పై పడింది. ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేసేందుకు తన అనుయాయులతో కలిసి స్కెచ్ వేస్తున్నారు. లీకులు ఇస్తున్నారు. డెన్మార్క్ ను భయపెడుతున్నారు. అమెరికా గ్రీన్ లాండ్ పై దాడి చేస్తే అది నాటోదేశంపైన దాడి అన్నట్టే అని.. పరిణామాలు ఎటు మారుతాయోనని డెన్మార్క్ ప్రధాని హెచ్చరించారు. దీంతో ఈ పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అంతర్జాతీయ రాజకీయ యవనికపై గ్రీన్‌లాండ్ అంశం మరోసారి పెను తుపానును సృష్టించింది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న పరిణామాల తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి గ్రీన్‌లాండ్‌పై పడటం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది.

ట్రంప్ వ్యాఖ్యలు.. యూరప్‌లో అలజడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ.. “గ్రీన్‌లాండ్ గురించి మరో 20 రోజుల్లో మాట్లాడతాం” అని చేసిన సంకేతాలు యూరప్ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. గతంలో కూడా గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనను ట్రంప్ తీసుకురాగా డెన్మార్క్ దానిని తీవ్రంగా తోసిపుచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

డెన్మార్క్ ప్రధాని ఘాటు హెచ్చరిక

ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ అత్యంత కఠినంగా స్పందించారు. ఇది కేవలం ఒక భూభాగ వివాదం కాదని, అంతర్జాతీయ రక్షణ కూటమి అయిన నాటో ఉనికికే ప్రమాదమని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఒక నాటో సభ్యదేశం డెన్మార్క్ పై దాడి చేస్తే లేదా ఒత్తిడి తెస్తే అది నాటో వ్యవస్థకే ముగింపు పలికినట్లే అని మెట్టె ఫ్రెడరిక్సెన్ హెచ్చరించారు.

నాటో అంటే ఏమిటి? ఎందుకు ఇంత ప్రాధాన్యత?

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో సోవియట్ యూనియన్ విస్తరణను అరికట్టడానికి అమెరికా నేతృత్వంలో ఏర్పడిన సైనిక కూటమే ఈ 'నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్'. ప్రస్తుతం నాటోలో 30కి పైగా దేశాలున్నాయి. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది కూటమిలోని అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమిగా దీనికి పేరుంది.

గ్రీన్ లాండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యత..

గ్రీన్‌లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికాకు దగ్గరగా ఉన్నప్పటికీ.. అది డెన్మార్క్ పరిధిలోని స్వయం పాలిత ప్రాంతం. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి అమెరికాకు ఇది కీలక స్థావరం. ఇక్కడ అపారమైన సహజ వనరులు, అరుదైన ఖనిజాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన 'తులే' ఎయిర్ బేస్ ఇప్పటికే ఇక్కడ ఉంది. ఇది క్షిపణి హెచ్చరిక వ్యవస్థలకు కీలకం.

చిచ్చుపెట్టిన మిల్లర్ దంపతులు..

ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ గ్రీన్ లాండ్ పై డెన్మార్క్ హక్కులనే ప్రశ్నించడం గమనార్హం. గ్రీన్ లాండ్ అమెరికా నియంత్రణలోకి వస్తే నాటో భద్రత పెరుగుతుందని ఆయన వాదించారు. మరోవైపు ఆయన సతీమణీ కేటీ మిల్లర్ ‘త్వరలో’ అంటూ అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్ లాండ్ మ్యాప్ ను పోస్ట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది.

ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు వెనెజువెలా పరిణామాలతో ప్రపంచం అట్టుడుకుతుంటే.. ఇప్పుడు 'గ్రీన్‌లాండ్' వేదికగా అమెరికా-డెన్మార్క్ మధ్య మొదలైన ఈ వివాదం ఎటు దారితీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. నాటో ఐక్యతను కాపాడుకోవడమా లేక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మిత్రదేశాలనే దూరం చేసుకోవడమా అన్నది అమెరికా ముందన్న సవాలు.

Tags:    

Similar News