ఫరూక్ కు సీటు.. భూమాకు దెబ్బ!
నంద్యాల నుంచి పోటీ చేసేందుకు భూమా బ్రహ్మానందరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు.
రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన భూమా కుటుంబానికి టీడీపీ షాక్ ఇవ్వనుందా? వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని బాబు దూరం పెట్టనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. భూమా రాజకీయ వారసులు భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల ప్రియకు టికెట్లు ఇచ్చేందుకు బాబు మొగ్గు చూపడం లేదని తెలిసింది.
నంద్యాల నుంచి పోటీ చేసేందుకు భూమా బ్రహ్మానందరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. కానీ బాబు మనసులో మాత్రం మరో రకమైన ఆలోచన ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డిని తప్పించేందుకు బీసీ జనార్ధన్ రెడ్డి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. బ్రహ్మానందరెడ్డిపై బాబు కు ఫిర్యాదు ఇస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో బాబు అరెస్టుకు ముందు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని భూమా అనుచరులు నినాదాలు చేసినా బాబు పట్టించుకోలేదు. సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఇప్పుడు నంద్యాల టికెట్ ను ఫరూక్ కు కేటాయించేందుకు బాబు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ వీడేందుకు బ్రహ్మానందరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. బ్రహ్మానందరెడ్డిని పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తానని, ఫరూక్ కు మద్దతు చెప్పాలని అధిష్టానం సూచించినా బ్రహ్మానందరెడ్డి వినలేదని టాక్. మరోవైపు పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని బాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇక్కడ అఖిల ప్రియ ఎలాగో గెలిచే అవకాశం లేదని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేనకు ఇచ్చేస్తే బెటర్ అని బాబు అనుకుంటున్నారు. మరోవైపు నంద్యాల టికెట్ బ్రహ్మానందరెడ్డికి కాకుండా తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి ఇవ్వాలని బాబును అఖిల డిమాండ్ చేశారని సమాచారం. కానీ బ్రహ్మానందరెడ్డితో అఖిల విభేధాలు ఇప్పుడూ ఇద్దరినీ ముంచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.