ఏపీలో మాటల యుద్ధం: 'నకిలీ' మద్యంపై పొలిటికల్ వార్!
ఈ నకిలీ మద్యం మూలాలు.. పలు జిల్లాల్లోనూ ఉన్నాయని ఆరోపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు కూడా పలు జిల్లాల్లో దాడులు చేసి.. నకిలీ మద్యం గుట్టును రట్టు చేస్తున్నారు.;
ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారం.. వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధాన్ని పెంచేస్తోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని పేర్కొంటూ వచ్చిన టీడీపీకి చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన.. నకిలీ మద్యం వ్యవహారం.. ఇబ్బందిగానే ఉంది. దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తోంది. ఈ నకిలీ మద్యం మూలాలు.. పలు జిల్లాల్లోనూ ఉన్నాయని ఆరోపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు కూడా పలు జిల్లాల్లో దాడులు చేసి.. నకిలీ మద్యం గుట్టును రట్టు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీ కూడా.. ఎదురు దాడి చేస్తోంది. నకిలీ మద్యం తయారుచేసే దొంగల ముఠాను పట్టుకుంది మా ప్రభుత్వమేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పనిలో పనిగా ఆయన ఈ నకిలీ మద్యం మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చుట్టే ఉన్నాయన్నారు. మద్యం గుట్టు మేము విప్పితే.. జగనే కనిపెట్టినట్లు సంబరాలు చేసుకుంటారా? అని ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియాలోను.. సొంత మీడియాలో ను వస్తున్న కథనాలను ఆయన ఉటంకించారు.
జగన్ హయాంలోని మద్యం స్కామ్‌ను తప్పుదారి పట్టించేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. గత ఐదేళ్లు కల్తీ మద్యం వల్ల 30 వేలమంది ప్రాణాలు కోల్పోయారని, కల్తీ సారా మృతుల పై గతంలో వైసీపీ నాయకులు హేళన చేసి మాట్లాడారని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు కల్తీ మద్యంపై వైసీపీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి వ్యాఖ్యానించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తేల్చి చెప్పారు.
ఎవరికి మంచిది..?
ఇలా.. ఒకరిపై ఒకరు నకిలీ మద్యం వ్యవహారంపై విమర్శలు చేసుకోవడం ఎవరికి మంచిది? ఎవరికి చెడ్డ ది అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. నకిలీ మద్యంలో టీడీపీ నాయకులు ఉన్నారన్నది వాస్తవం. అందుకే.. ఆ పార్టీ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి తీసుకు రావడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం. అలా కాదనిఎదురు దాడికి దిగితే.. అది సర్కారుకే నష్టమన్న వాదన వినిపిస్తోంది. ఇక, వైసీపీ హయాంలోనూ.. ఇలానే జరిగింది కాబట్టి.. దీనిని పెద్దది చేయడం వల్ల విమర్శలు మూటగట్టుకోవడమే తప్ప.. మరొకటి లేదని అంటున్నారు.