పదో తరగతి నుండి బీటెక్ వరకు... చదువుకోకుండానే సర్టిఫికెట్లు!
రాష్ట్రంలో నకిలీ విద్యా సర్టిఫికెట్ల రాకెట్ భారీ స్థాయిలో నడుస్తున్న విషయం రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.;
రాష్ట్రంలో నకిలీ విద్యా సర్టిఫికెట్ల రాకెట్ భారీ స్థాయిలో నడుస్తున్న విషయం రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. "పదో తరగతి నుండి బీటెక్ వరకు... చదువుకోకుండానే సర్టిఫికెట్లు!" అంటూ యువతను ఉద్దేశించి ప్రచారం చేస్తున్న ఓ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నార్సింగి ప్రాంతంలో నెలకొల్పిన ఓ గుట్టు ఆఫీసులో పోలీసులు దాడి చేయగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ కార్యాలయంలో ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్లు సహా వివిధ రాష్ట్రాల యూనివర్సిటీల పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
రాకెట్‌కు మాస్టర్‌మైండ్: మీర్జా అక్తర్ అలీ బేగం
ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌కు కీలక కారకుడు మీర్జా అక్తర్ అలీ బేగం అని పోలీసులు తెలిపారు. డాక్యుమెంట్ల తయారీ, ప్రింటింగ్, విక్రయం.. మొత్తం కార్యక్రమాన్ని ఇతనే పర్యవేక్షిస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ , సర్టిఫికెట్లు కొనుగోలు చేసే ప్రజల మధ్య దలారి పాత్ర పోషించిన మహమ్మద్ అహ్మద్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ నుండి నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వెంకటసాయి, రోహిత్, ప్రవీణ్ కుమార్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఉద్యోగ అవసరాల కోసం ఫేక్ డాక్యుమెంట్లు పొందడానికి ప్రయత్నించినట్టు వెల్లడించారు.
ధరలు ఎలా ఉండేవి?
పదో తరగతి సర్టిఫికేట్ కు ₹50,000, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కు ₹75,000, డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్లకు ఇంకా ఎక్కువ ధరలు ఉండనున్నాయి. తక్కువ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉన్న మిగతా రాష్ట్రాల యూనివర్సిటీ పేర్లను ఎక్కువగా వాడి సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్టు తెలిసింది.
*దర్యాప్తు వేగవంతం: ఎక్కడెక్కడ వినియోగించారు?
పోలీసులు ఇప్పుడు కొన్ని కీలక అంశాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఫేక్ సర్టిఫికెట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు ఎంత మంది ఉన్నారు? వారిని ఏ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు? పాస్‌పోర్ట్, వీసాల కోసం లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల్లో వీటిని ఉపయోగించారా? అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. వాస్తవాలు బయటకు వస్తున్న కొద్దీ ఈ రాకెట్ పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
డిజిలాకర్‌తో సులభంగా వెరిఫికేషన్!
నకిలీ సర్టిఫికెట్ల సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండడంతో సంస్థలు వెంటనే వెరిఫికేషన్ చేయవచ్చు. అంతేకాకుండా, మెమోలు, సర్టిఫికెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ల ద్వారా కూడా నకిలీలను చాలా సులభంగా గుర్తించే అవకాశం ఉంది.
యువత ఎవరూ కూడా అడ్డదారిలో సర్టిఫికెట్లను కొనుగోలు చేసి తమ జీవితాలను ప్రమాదంలో పడేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాలు లేదా ఇతర అవసరాల కోసం ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లను సమర్పించినట్లు తేలితే, వారికి ఉద్యోగం కోల్పోవడంతో పాటు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.