ఆ దేశాధ్యక్షుడిపై 51 ఏళ్ల వ్యక్తి పోస్టు.. మరణశిక్ష విధించిన కోర్టు

సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే పోస్టులపై కొన్ని ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో తెలిసిందే.;

Update: 2025-10-05 07:11 GMT

సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే పోస్టులపై కొన్ని ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో తెలిసిందే. అయితే.. దీనికి పరాకాష్ఠగా ఇప్పుడీ ఉదంతాన్ని చెప్పాలి. 34 ఏళ్ల క్రితం ఒక సీరియల్ కిల్లర్ కు మరణశిక్ష విధించిన ఆ దేశంలో తాజాగా ఫేస్ బుక్ లో దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా పోస్టు పెట్టిన 51 ఏళ్ల వ్యక్తికి ఆ దేశ కోర్టు మరణశిక్షను విధించింది. ఈ ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా కొత్త చర్చకు తెర తీసింది. ఇంతకూ ఈ ఉదంతం ఏ దేశంలో చోటు చేసుకుందన్న విషయంలోకి వెళితే.. ట్యూనీషియా.

ఉత్తర ఆఫ్రికాలోని ఈ దేశానికి సరిహద్దు దేశాలుగా అల్జీరియా, లిబియాలు ఉన్నాయి. 2017 గణాంకాలతో చూస్తే ఆ దేశ జనాబా 12 మిలియన్ల వరకు ఉంటారు. పెరిగినజనాభాతో 15-18 మిలియన్ల వరకు ఉండొచ్చు. 1956 మార్చి 20న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఈ దేశం ట్యునీషియా రిపబ్లిక్ గా మారింది. ఈ దేశాధ్యక్షుడిగా కయస్ సయిద్ వ్యవహరిస్తున్నారు. తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువన్న పేరున్న ఈ దేశంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు అంతర్జాతీయంగా అందరిని ఆకర్షిస్తోంది.

అధ్యక్షుడ్ని అగౌరవపరిచేలా ఆన్ లైన్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో 51 ఏళ్ల వ్యక్తిని ఏడాదిన్నర క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న అతడిపై కోర్టులో విచారణ సాగుతోంది. దేశాధ్యక్షుడిపై వ్యతిరేకిస్తూ పోస్టు పెట్టిన వ్యక్తి దినసరి కూలీ అని.. పని దొరికినిప్పుడు మాత్రమే పని చేసుకునే బడుగు జీవిగా అతడి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

పని చేసే ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో అంగవైకల్యానికి గురైన అతను.. తన బాధల్ని చెప్పుకోవటానికే పోస్టు పెట్టాడే తప్పించి.. దేశంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు కాదని.. అతడి విద్యార్హతలు కూడా తక్కువని.. ఆన్ లైన్ లో అతను ప్రభావితం చేసే స్థాయి కూడా లేదని లాయర్లు పేర్కొన్నారు. అతను పెట్టిన పోస్టు.. ఆన్ లైన్ లో ఉన్న సమాచారమే తప్పించి.. ఇంకేమీ కాదని పేర్కొన్నారు.

అతడి పోస్టుల్ని ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పటికే పలు పోస్టులు పెట్టినట్లుగా లాయర్లు తెలిపారు. అయితే.. ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ప్రజల్లో తిరుగుబాటుకు ప్రయత్నించాడని.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా అతడి చర్యలు ఉన్నాయని పేర్కొంటూ అతడికి మరణశిక్ష విధిస్తున్నట్లుగా తీర్పును ఇచ్చింది. ట్యూనీషియా చట్టాల్లో మరణశిక్ష నిబంధన ఉన్నప్పటికీ చాలా అరుదుగా విధిస్తుంటారు. అలాంటిది ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన దానికి మరణశిక్ష విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Tags:    

Similar News