కాళేశ్వరం కేసీఆర్ కట్టింది కాదు : ఈటల యూటర్న్?
బీజేపీనాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ యూటర్న్‌తీసుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణకు సంబంధించి ఆయన కేసీఆర్‌కు దాదాపు క్లీన్ చిట్ ఇచ్చేశారు.;
బీజేపీనాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ యూటర్న్‌తీసుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణకు సంబంధించి ఆయన కేసీఆర్‌కు దాదాపు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈటల.. కాలేశ్వరం ప్రాజెక్టు అసలు కేసీఆర్ కట్టింది కాదని.. అసలు దానిని ప్రత్యేక ప్రాజెక్టుగా కూడా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలకులు కట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి కాళేశ్వరాన్ని నిర్మించినట్టు తెలిపారు.
దీనిపై అసలు కమిషన్ విచారణ కూడా.. సరిగా జరగడం లేదని ఈటల వ్యాఖ్యానించారు. ఇది కాళేశ్వరం కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్‌లాగానే ఉందని ఎద్దేవా చేశారు. దీనిని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పా రు. కాళేశ్వరం అవకతవకలపై నిష్పాక్షిక విచారణ జరగాలనేదే బీజేపీ మాటగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. విచారణ అలా జరగడం లేదని చెప్పారు. ఎక్కడికక్కడ లొసుగులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలో ఈ విచారణను సీబీఐకి అప్పగించాలని ఈటల డిమాండ్ చేశారు.
ఇక, తనపై కొందరు లేని పోని విమర్శలు చేస్తున్నారని ఈటల రాజేందర్ కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముధైర్యం ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటానని చెప్పారు. ''కాళేశ్వరం మీకు కలిసి వచ్చింది. నాపై ఆరోపణలు చేస్తున్నారు.కానీ, వీటిని నిరూపించాలి. అలా చేస్తే.. నేను పదవినే కాదు.. రాజకీయాలను కూడా వదులుకుంటా'' అని ఈటల అన్నారు. గతంలో కాళేశ్వరం కట్టినప్పుడు కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారని చెప్పారు.