‘అందరికీ జీతం.. పేదరికం లేని సమాజం’.. ఆసక్తిరేపుతున్న ఎలాన్ మస్క్ విజన్
మస్క్ విజన్ ప్లాన్ పై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన చెప్పిన ప్రకారం పేదరికం అంతం అన్నది సాధ్యమా? అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.;
వచ్చే కొన్నేళ్లలో ప్రపంచంలో పేదరికం అన్న పదమే వినిపించదని, పౌరులకు కావాల్సిన కనీస ఆదాయాన్ని ప్రభుత్వమే సమకూర్చి పోషిస్తుందని అపర కుభేరుడు ఎలాన్ మస్క్ అంటున్నారు. మస్క్ విజన్ ప్లాన్ పై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన చెప్పిన ప్రకారం పేదరికం అంతం అన్నది సాధ్యమా? అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మనషులు పనిచేయకుండానే హాయిగా గడపొచ్చని చెబుతున్న మస్క్.. మనుషులకు బదులుగా భవిష్యత్తులో పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన రొబోట్స్ చేస్తాయని అంటున్నాడు. దీంతో మస్క్ మాటలు ఇప్పుడు ఆసక్తిరేపుతున్నాయి.
భవిష్యత్తులో పేదరికం ఉండదు
ప్రపంచంలో పెద్దస్థాయిలో రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతూ వస్తోందని మస్క్ చెబుతున్నాడు. దీనివల్ల రాబోయే కాలంలో పేదరికం పూర్తిగా తొలగిపోతుందని మస్క్ విశ్లేషిస్తున్నాడు. మనుషులు బలవంతంగా పనులు చేయడానికి వెళ్లరని, తాము ఇష్టపడిన పని మాత్రమే చేస్తారని ఆయన ఊహిస్తున్నాడు. ఇందుకు ఆయన చెబుతున్నది ఒక్కటే.. భవిష్యత్తులో రోబోట్స్ మాత్రమే పని చేస్తాయట. AIతో కలిసి రోబోలు అన్ని రకాల పనులు చేయడం వల్ల మనుషుల కన్నా వేగంగా, చవకగా ఆయా పనులు పూర్తవుతాయని అంటున్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలు, రవాణా, వ్యవసాయం, స్టోర్లు అన్నీ ఆటోమేటిక్ గా పనిచేస్తాయని, ఉత్పత్తి ఖర్చు దాదాపుగా తగ్గిపోతుందని లెక్కలు వేస్తున్నాడు. అంతే కాకుండా కొరత అన్న పదమే వినిపించదని మస్క్ విశ్లేషిస్తున్నాడు.
అందరికీ ప్రభుత్వ జీతం
మస్క్ చెప్పిన ప్రకారం రోబోలు పని చేస్తే ఉద్యోగాలు తగ్గిపోతాయని ఎవరికైనా సందేహం కలగొచ్చు. దానికి ఆయన వద్ద సమాధానం ఉందని చెబుతున్నాడు. ఉత్పత్తి ఖర్చులు తగ్గిపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, అప్పుడు ప్రభుత్వమే తన ఆదాయాన్ని ప్రజలకు పంచుతుందని మస్క్ ప్రతిపాదిస్తున్నాడు. దీనిని UBI – యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ అంటారని మస్క్ చెబుతున్నాడు. ఇది జీవనానికి కావలసిన డబ్బు అందరికీ హామీగా ఇస్తుందని ఆయన విశ్లేషిస్తున్నాడు. దీంతో పేదరికం అనే పదానికి అర్ధమే ఉండదని మస్క్ అభిప్రాయంగా చెబుతున్నారు.
“సర్వైవల్” నుంచి “పర్పస్” వైపు జీవితం
ఎలాన్ మస్క్ ఊహ ఏంటంటే భవిష్యత్తులో ఉద్యోగం కోసం పోరాటం ఉండదట.. జీవించడానికి ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెబుతున్నాడు. మనుషులు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారని, ఆర్ట్, మ్యూజిక్, కథలు, సైన్స్, ఎక్స్‌ప్లోరేషన్, సోషల్ వర్క్ ఇలా తమకు నచ్చిన పనితో గడుపుతారని అంటున్నాడు. జీవనోపాధి కోసం కాకుండా జీవితం కోసం పని చేసే ప్రపంచం ఆవిష్కృతమవుతుందని ఎలాన్ మస్క్ అంటున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే ఎలాన్ మస్క్ ఈ ఊహ నిజమవుతుందా? ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? వీటన్నిటిపైనా సోషల్ మీడియా ప్రపంచంలో చర్చ జరుగుతోంది. AI వల్ల రాబోయే 20 సంవత్సరాలు మనిషి చరిత్రలోనే అత్యంత మార్పుల దశకు చేరుకుంటుందని అంటున్నారు. కొన్ని ఉద్యోగాలు మాయమై, కొత్త ఉద్యోగాలు పుట్టుకు రావడం ఖాయమంటున్నారు. ఇందులో డ్రోన్ సర్వీసులు, AI టెక్నీషియన్లు, క్రియేటివ్ ఫీల్డ్స్ ఇలా కొన్నిరకాల ఉద్యోగాలను ఉదహరిస్తున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన యూఎస్-సౌదీ పెట్టుబడి సదస్సులో ఎలాన్ మస్క్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వాలు మరియు NGO లు విఫలమయ్యాయని పేర్కొంటూ, దానికి పరిష్కారం కేవలం సాంకేతికత మాత్రమేనని మస్క్ వాదిస్తున్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని ధనవంతులు చేసే ప్రాథమిక మార్గం కూడా ఏఐ, రోబోటిక్స్ అంటున్నాడు మస్క్.