ఈసీ కన్నెర్ర..345 రాజకీయ పార్టీలపై చర్యలు షురూ.. తెలుగు పార్టీలూ?
నమోదిత జాబితా నుంచి తొలగించనున్న పార్టీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఉన్నాయా? అంటే ఉండే ఉంటాయని చెప్పొచ్చు.;
పేరుకు రాజకీయ పార్టీలుగా నమోదై ఉంటాయి.. కార్యక్షేత్రంలో మాత్రం కనిపించవు.. ఎప్పుడూ కార్యకలాపాలు కూడా చేయవు.. మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఉండీ లేనట్లే అంటే ఎలా..? అందుకే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రాజకీయ పార్టీలపై కొరడా ఝళిపించింది. రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయనందుకు వాటిని నమోదిత పార్టీల నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఇందుకు 2019ని పారామీటర్‌గా ఎంచుకుంది. దీనిప్రకారం గత ఆరేళ్లలో... రాజకీయ పార్టీగా నమోదై ఉండి ఎన్నికల్లో పోటీ చేయని పార్టీల ఏవి అని లెక్క తీసింది. వీటిపై చర్యలు తీసుకుంది.
ఏదో ఆవేశంలోనో.. లేదా మరో ఉద్దేశంలోనో.. లేదా ఇంకో దూరాలోచనతోనో రాజకీయ పార్టీని నమోదు చేయడం.. ఆ తర్వాత దాని కార్యకలాపాలను విస్మరించడం.. ఇలా ప్రజాస్వామ్యంలో జరగడం సహజం. అంతెందుకు..? మంచి పేరు ఉండి.. ఆర్థికంగానూ బలంగా ఉండి.. సామాజిక వర్గ బలం ఉన్న పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించాలంటే నిత్యం చైతన్యంతో ఉండాలి. కానీ, నాయకత్వంలో లోపం కారణంగా.. అచేతనంగా ఉండిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నమోదిత అంశానికే పరిమితమైన పార్టీల సంగతి చెప్పేదేముంది..? అందుకనే ఇలాంటివాటి సంగతి తేల్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
2019 నుంచి ఎన్నికల్లో అసలు పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను (రిజిష్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్)ను ఎన్నికల సంఘం గుర్తించింవది. వాటిని జాబితా నుంచి తొలగించే (డీలిస్ట్) ప్రక్రియను ప్రారంభించింది. మరోవైపు ఇలా నమోదిత పార్టీలుగా ఉన్న పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ పరిశీలనలో తేలడం గమనార్హం.
తెలుగు పార్టీలు ఉన్నాయా?
నమోదిత జాబితా నుంచి తొలగించనున్న పార్టీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఉన్నాయా? అంటే ఉండే ఉంటాయని చెప్పొచ్చు. తెలంగాణలో దాదాపు రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చిన్నాచితకా పార్టీలు పోటీచేశాయి. ఆ తర్వాత అయిపు అజా లేవు. ఇక ఎన్నికల సంఘం డీలిస్ట్ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని రాజకీయ పార్టీలు ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈసీ వద్ద 2,800 పైగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండడం గమనార్హం. వీటిలోంచే 345 పార్టీలను తొలగించనుంది.
కాగా, ఎన్నికల సంఘం ప్రకారం నమోదిత పార్టీ వేరు.. గుర్తింపు పొందిన పార్టీ వేరు. దేని లెక్కలు దానికి ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీకి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా రావాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలవాలి. అలా కాని పార్టీలు నమోదిత గుర్తింపులేని పార్టీలుగానే మిగులుతాయి.