బెంగళూరులో ఎయిర్‌పోర్టులో ఎబోలా అనుమానాస్పద లక్షణాలు?

ఉగాండా నుంచి వచ్చిన ఒక యువతిలో ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు.

Update: 2026-05-27 06:52 GMT

ప్రపంచ వ్యాప్తంగా పాకుతున్న ఎబోలా వైరస్ భయం ఇప్పుడు ఐటీ హబ్ బెంగళూరును కలవరపెడుతోంది. ఉగాండా నుంచి వచ్చిన ఒక యువతిలో ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ వార్తతో ఒక్కసారిగా బెంగళూరు నగరం ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగింది? ఆ మహిళకు ఎబోలా సోకిందా లేదా? కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అనే అంశాలు చూద్దాం..

ఈ నెల మే 23న ఉగాండా దేశం నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన 28 ఏళ్ల మహిళ తీవ్ర అలసట, నీరసంతో కనిపించింది. దీంతో అలర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్లు ఆమెను పరీక్షించారు. ఎబోలా లక్షణాలుగా అనుమానించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందిరానగర్‌లోని ఎపిడెమిక్ డిసీజెస్ హాస్పిటల్‌కు తరలించారు.

పూణే ల్యాబ్‌కు శాంపిల్స్:

ఇక ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, వైద్యులు ఆమెను ప్రత్యేక నిఘాలో ఉంచారు. ఎబోలా వైరస్ ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవడానికి ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి పూణేలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' కి పంపించారు. ఇక నిబంధనల ప్రకారం పూర్తి క్లారిటీ కోసం రెండోసారి కూడా టెస్టులు చేయనున్నారు.

హోటల్ నుంచి హాస్పిటల్‌కు:

సదరు మహిళ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఒక హోటల్‌కు వెళ్లి బస చేసింది. అయితే ఆ తర్వాత ఒళ్లు నొప్పులు తీవ్రమవ్వడంతో అధికారులు సమాచారం అందుకుని ఆమెను క్వారంటైన్‌కు మార్చారు. ఆమెతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.

కర్ణాటక వ్యాప్తంగా హై అలర్ట్:

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్, మంగళూరు ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ఇక అత్యవసర పరిస్థితినైనా తట్టుకునేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు కూడా రంగంలోకి దిగాయి.

కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది?:

ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు భారతదేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, సదరు మహిళకు ఇంకా వ్యాధి నిర్ధారణ కాలేదని, కేవలం ముందస్తు జాగ్రత్తగానే ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపింది. ఎవరు ఎలాంటి భయాలకి పోనవసరం లేదు అని కేంద్రం స్పష్టం చేసింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా బెంగళూరు అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు అభినందనీయం. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే వరకు ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కాస్త అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News