వంద శాతం ఇథనాల్.. పెట్రోల్ కి పూర్తి ప్రత్యామ్నాయం.. లాభమా? నష్టమా?
సాధారణంగా మనం వాడే పెట్రోల్‌లో కొంత శాతం ఇథనాల్ కలుపుతారు. ప్రస్తుతం భారత్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన 'ఈ20' ఇంధనాన్ని వాడుతున్నాం.
భారత ఇంధన, ఆటోమొబైల్ రంగాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పడింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, విదేశీ ముడిచమురు దిగుమతుల భారాన్ని వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. వంద శాతం ఇథనాల్ నిబంధనలకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా 'ఈ100' ఇంధనంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి, టొయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఈ100 ఇంధనంతో నడిచే వాహనాలను తయారు చేసేందుకు లైన్ కడుతున్నాయి.
అసలు 'ఈ-100' అంటే ఏమిటి?
సాధారణంగా మనం వాడే పెట్రోల్‌లో కొంత శాతం ఇథనాల్ కలుపుతారు. ప్రస్తుతం భారత్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన 'ఈ20' ఇంధనాన్ని వాడుతున్నాం. కానీ, ఇప్పుడు కేంద్రం అనుమతించిన 'ఈ100' అంటే.. ఇందులో అసలు సాంప్రదాయ పెట్రోలే ఉండదు! ఇది దాదాపు 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో కూడిన ఇంధనం. చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ఆహార ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారుచేసే పునరుత్పాదక ఇంధనమే ఈ ఇథనాల్.
ఎందుకు ఇంత మొగ్గు?
మన దేశం ముడిచమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మారిన ప్రతిసారీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతోంది. ఈ100 ఇంధనాన్ని వాడటం వల్ల విదేశాల నుంచి కొనే ముడిచమురు భారం భారీగా తగ్గుతుంది. ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న వంటి పంటలు కావాలి కాబట్టి, వీటికి మార్కెట్లో డిమాండ్ పెరిగి అన్నదాతలకు మంచి లాభాలు వస్తాయి. సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గి, గాలి కాలుష్యం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.
పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేయగలదా?
ఈ100 ఇంధనం పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేయగలదు కానీ.. భారత మార్కెట్లో ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రోడ్లపై ఉన్న సాధారణ వాహనాలు 'ఈ20' ఇంధనానికి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. వాటిలో నేరుగా ఈ100 పోస్తే ఇంజిన్ నడవదని అంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ఫ్లెక్స్-ఫ్యూయెల్' వాహనాలు అందుబాటులోకి రావాల్సి ఉందని చెబుతున్నారు. స్వచ్ఛమైన ఇథనాల్‌తో బండి నడవాలంటే ఇంజిన్‌ను ప్రత్యేకంగా రీ-డిజైన్ చేయాలి. ఇంజిన్ కాలిబ్రేషన్‌తో పాటు ఇంజెక్టర్లు, ఫ్యూయెల్ పంపులు, ఫ్యూయెల్ లైన్లలో మార్పులు అవసరమవుతాయి. ఇప్పటికే మారుతీ సుజీకి సంస్థ తన ప్రముఖ 'వ్యాగన్-ఆర్' కారును ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోడల్‌గా రూపొందించింది. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
కేంద్ర నిర్ణయం అద్భుతమైనదే అయినప్పటికీ, ఇందులో కొన్ని ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయని అంటున్నారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌కు శక్తి తక్కువ. దీనివల్ల వాహనాల మైలేజ్ దాదాపు 20 నుంచి 30 శాతం వరకు పడిపోయే అవకాశం ఉంది. ఇథనాల్‌కు వాతావరణంలోని తేమను గ్రహించే గుణం ఎక్కువ. దీనివల్ల ఇంజిన్ లోపలి భాగాలు త్వరగా తుప్పు పట్టే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బంకుల్లో ఈ100 ఇంధనాన్ని నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను మార్చాల్సి ఉంటుంది. సవాళ్లు ఉన్నప్పటికీ.. భవిష్యత్తు మాత్రం క్లీన్ ఎనర్జీదే అనడంలో సందేహం లేదు. కేంద్రం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం భారతదేశాన్ని ఇంధన రంగంలో స్వయంసమృద్ధి వైపు నడిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.