'జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం'... ట్రంప్ ఆగ్రహానికి కీలక కారణం!
Donald Trump Boycotts G20 Summit in South Africa, Calls It a Total Disgrace;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దక్షిణాఫ్రికాపై ఆగ్రహం ఏ రేంజ్ లో ఉందో చెప్పే ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును బాయ్ కాట్ చేస్తున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో జీ-20 గ్రూప్ నుంచి సౌతాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి తన వద్ద బలమైన కారణం ఉందంటూ వెల్లడించారు.
అవును... సౌతాఫ్రికాలో జీ-20 సదస్సుకు హాజరయ్యే విషయంపై అమెరికా అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరమని.. ఆ దేశంలో మైనార్టీలు అయిన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయని.. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలని అన్నారు.
ఆ కారణంతోనే అమెరికా జీ-20 సదస్సుల్లో పాల్గొనడం లేదని తెలిపారు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో... 2026 జీ-20ని ఫ్లోరిడాలోని మయామిలో నిర్వహించడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
వాస్తవానికి నవంబర్ 22-23 తేదీల్లో ప్రధాన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నాయకుల సమావేశంలో తాను పాల్గొనబోనని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. అయితే ఆయన స్థానంలో జేడీ వాన్స్ హాజరవుతానే ప్రచారం నాడు జరిగింది. అయితే.. తాజా నివేదికల ప్రకారం, ట్రంప్ ప్రకటన నేపథ్యంలో.. జేడీ వాన్స్ షెడ్యూల్స్ లో జీ-20 సదస్సు లేదని తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాపై తీవ్రమైన ఆరోపణలు!:
సౌతాఫ్రికాలో తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దాడులకు గురవుతున్నారని.. అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలవుతుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో.. దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. తన వార్షిక శరణార్థుల సంఖ్యను 7,500 గా తగ్గించడంలో శ్వేతజాతి దక్షిణాఫ్రికా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు!
ట్రంప్ వాదనలను ఖండించిన సౌతాఫ్రికా!:
ఈ స్థాయిలో ట్రంప్ ఫైరవ్వడంపై దక్షిణాఫ్రికా స్పందించింది. ఈ సందర్భంగా... వర్ణవివక్ష ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత కూడా శ్వేతజాతి పౌరులు నల్లజాతి దక్షిణాఫ్రికా ప్రజల కంటే ఉన్నత జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు.. తెల్ల రైతులను హింసిస్తున్నారనే నివేదికలు పూర్తిగా అబద్ధం అని ట్రంప్ తో చెప్పానని అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అన్నారు.