కాంగ్రెస్ డీకేతో వైసీపీ వెరీ క్లోజ్ ఎందుకో ?
డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమత్రి. కరడు కట్టిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ అధినాయకత్వానికి రైట్ హ్యాండ్.;
డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమత్రి. కరడు కట్టిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ అధినాయకత్వానికి రైట్ హ్యాండ్. సీఎం కావాల్సిన వారు. అయితే సిద్ధరామయ్యకు సీటు ఇచ్చి డిప్యూటీగా ఉన్నారు. కానీ ఏదో నాటికి సీఎం అవుతారు అని అంటున్నారు. ఇక డీకే శివకుమార్ సత్తా ఉన్న లీడర్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కర్ణాటకలో కీలకమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ట్రబుల్ షూటర్ గా కూడా ఆయనకు ఒక పేరు ఉంది. అలాంటి డీకేతో ఏపీలోని వైసీపీకి సంబంధం ఏమిటి అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
ఆయన వెనకన :
ఏపీకి డీకే శివకుమార్ ఎపుడు వచ్చినా ఆయన వెనకాలనే ఏపీకి చెందిన వైసీపీ నేతలు కనిపిస్తూంటారు. దీంతో ఇది రాజకీయంగా చర్చగానూ దారి తీస్తోంది. తాజాగా చూస్తే కార్తీక మాసం ప్రారంభం అవుతూనే డీకే ఏపీకి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో స్వామిని దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఇక డీకే వెంట కొందరు కాంగ్రెస్ మంత్రులు కూడా ఉన్నారు. అయితే డీకేకి ఏపీలో చూస్తే వైసీపీ నేతల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. ఆయనతో వారు కలసి ముచ్చట్లు పెడుతున్నారు అని అంటున్నారు.
భేటీలు వేసి :
ఇక డీకే మంత్రాలయం రావడంతో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అలాగే వైసీపీ ఎమ్మెల్సీ ఇతర కీలక నేతలు కలసి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత డీకే బస చేసిన చోటుకు వెళ్ళి కొంతసేపు భేటీ వేశారు అని అంటున్నారు. డీకేతో వైసీపీ నేతలు ఇంతలా సాన్నిహిత్యంగా ఉండడం అయితే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది అని అంటున్నారు.
అంతకు ముందు కూడా :
ఇదిలా ఉంటే గతంలో డీకే శివకుమార్ శ్రీకాళహస్తికి వెళ్ళినపుడు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఒకాయన డీకేకు స్వాగతం పలకడమే కాకుండా ఆయన రాక సందర్భంగా స్థానికంగా అన్ని ఏర్పాట్లూ చూసుకున్నారని చెబుతున్నారు. ఇక ఇదే నేత ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కవిత తాజాగా శ్రీకాళహస్తి వెళ్ళినపుడు కూడా ఆమెకు అక్కడ స్థానికంగా జరగాల్సిన మర్యాద ఏర్పాట్లూ అన్నీ దగ్గరుండి చూసుకున్నారని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ తో వైసీపీకి ఉన్న సాన్నిహిత్యాన్ని అర్ధం చేసుకోవచ్చు అలాగే కేసీఆర్ తనయ కాబట్టి ఆ మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించారు అంటే ఆలోచించవచ్చు కానీ కాంగ్రెస్ కి చెందిన డీకే విషయంలో ఎందుకు ఇంతలా స్వాగతాలు పలడం అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
కాంగ్రెస్ ని యాంటీగా :
ఇక ఏపీలో చూస్తే వైసీపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ వస్తోంది. జగన్ అయితే ఫక్తు కాంగ్రెస్ వ్యతిరేకి అన్నది పలు సందర్భాలలో రుజువు అయింది. తాజాగా ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా ఎన్డీయే అభ్యర్ధికే వైసీపీ మద్దతు ఇచ్చింది అని అంటున్నారు. అలాంటిది కాంగ్రెస్ కి చెందిన కీలక నేతతో సీఎం స్థాయి వ్యక్తితో వైసీపీ నేతలు సన్నిహితంగా ఉండడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి అని అంటున్నారు. అయితే రాయలసీమ నేతలు ఎక్కువగా కర్ణాటకలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారు అక్కడ రాజకీయ నేతలతో ఎపుడూ టచ్ లో ఉంటూ ఉంటారని అలా వ్యక్తిగతంగా ఉండే మర్యాదలు ఆదరణ తప్పించి ఇందులో వేరేదీ లేదని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే డీకే శివకుమార్ వైఎస్సార్ ఫ్యామిలీకి కూడా బాగా కావాల్సిన వారుగా కూడా చెబుతారు. సో అలా ఆయనకు వైసీపీకి మధ్య ఒక కనెక్షన్ ఉందని అంటున్నారు.