‘మూడు నెలల్లో ముఖ్యమంత్రి మార్పు’... కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

అవును... కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.;

Update: 2025-06-30 03:15 GMT
‘మూడు నెలల్లో ముఖ్యమంత్రి మార్పు’... కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఓ రాష్ట్రంలో త్వరలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందని.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రే త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని చెబుతూ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సంచలన వార్త పుట్టిన రాష్ట్రం కర్ణాటక కావడం గమనార్హం.

అవును... కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా జరుగుతోన్న ప్రచారం త్వరలో నిజం కాబోతుందంటూ... కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఎ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన హుస్సేన్... మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని అన్నారు.

ఇదే సమయంలో... ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం డీకె శివకుమార్‌ గురించే మాట్లాడుతోందని.. అన్నీ అనుకూలంగా జరిగితే త్వరలో శివకుమార్ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే... ఈ ఏడాది చివర్లో కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. శివకుమార్‌ కు సన్నిహితుడైన హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కాగా... ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు నెలకొంటాయని కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే కర్ణాటకలో నాయకత్వ మార్పు తథ్యమనే చర్చ అధికార పార్టీలో విస్తృతంగా మొదలైంది. శివకుమార్ సీఎం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు!

మరోవైపు.. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. నాయకత్వ మార్పు అనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని విషయమని.. దీనిపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు.

Tags:    

Similar News