అవును.. ధర్మస్థలి మీద తప్పుడు ప్రచారం చేయమంటే చేశా
ప్రసిద్ధ ఆలయ పరిసరాల్లో వందలాది మృతదేహాలను పాతి పెట్టానని సంచలన వ్యాఖ్యలు చేసి అందరిని షాక్ కు గురి చేసిన పారిశుద్ధ్య కార్మికుడు చన్నయ్య అసలు నిజాన్ని బయటపెట్టాడు;
దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ధర్మస్థలి వివాదం కీలక మలుపు తిరిగింది. ప్రసిద్ధ ఆలయ పరిసరాల్లో వందలాది మృతదేహాలను పాతి పెట్టానని సంచలన వ్యాఖ్యలు చేసి అందరిని షాక్ కు గురి చేసిన పారిశుద్ధ్య కార్మికుడు చన్నయ్య అసలు నిజాన్ని బయటపెట్టాడు. తాను ఏ మృతదేహాన్ని పాతి పెట్టలేదని.. తనను అలా తప్పుడు ప్రచారం చేయాలని ఒత్తిడి చేశారని.. అందుకే చేసినట్లుగా చెప్పి అందరి నోట మాట రాకుండా చేశాడు.
తాజాగా అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశ పెట్టారు. తదుపరి దర్యాప్తు కోసం పది రోజుల పాటు సిట్ కస్టడీకి తీసుకునేందుకు అనుమతిని ఇస్తూ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో.. అతడ్ని అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు వెల్లడించారు. చన్నయ్య చూపించిన పదిహేడు ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వి చూడగా..ఒక్క చోట కూడా డెడ్ బాడీలు బయటపడింది లేదు. ఇరవై రోజులుగా మృతదేహాల ఆనవాళ్ల కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
దీంతో.. తవ్వకాల్ని ఆపేసిన అధికారులు.. అసలు ఈ తరహా ఫిర్యాదు చేసిన చన్నయ్యను రివర్సులో విచారించటం మొదలు పెట్టారు. దీంతో.. అతను అసలు నిజాన్నిబయటకు చెప్పి అధికారులు కంగుతినేలా చేశాడు. తాను తమిళనాడులో నివసిస్తుండగా.. ఏడాదిన్నర క్రితం అదే ప్రాంతానికి చెందిన కొందరు తనను కలిసి.. ధర్మస్థలిలో మృతదేహాలను పాతి పెట్టినట్లుగా ప్రచారం చేయాలని కోరినట్లుగా వెల్లడించారు.
తొలుత తాను ఒప్పుకోలేదని.. కానీ వారు నెలల తరబడి తనను వెంబడించి ఒత్తిడి తీసుకురావటంతో తాను ఒప్పుకున్నట్లుగా పేర్కొన్నారు. ఒక పుర్రెను తీసుకొచ్చి.. వారి సలహాలకు అనుగుణంగా కంప్లైంట్ చేసినట్లుగా చెప్పటంతో.. ఇలా ఎందుకు ప్రచారం చేయాలని చెప్పిందెవరు? వారి లక్ష్యమేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు.. ధర్మస్థల వివాదానికి ప్రధాన కారణమైన సుజాత భట్ అసలు రంగు బయటకు వచ్చింది. తన కుమార్తె ధర్మస్థలి వెళ్లి మిస్ అయ్యిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం తెలిసిందే.
తన కుమార్తె కస్తూర్బా మెడికల్ కాలేజీలో చదువుతుండేదని.. ఫ్రెండ్ తో కలిసి ధర్మస్థలికి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయటం తెలిసిందే. నమ్మలేని నిజం ఏమంటే.. అసలు సుజాతకు పిల్లలే లేరని.. ఆమె బంధువులు స్పష్టం చేయటంతో పాటు.. సుజాత చూపించిన అనన్య ఫోటో ఆమెది కాదని.. ఆమెకు పిల్లలే లేరని స్పష్టం చేయటంతో పోలీసుల విచారణ కోణమే మారింది. వందలాది మృతదేహాలను పూడ్చినట్లుగా చెప్పుకున్న చన్నయ్య కూడా తాను తప్పుడు ప్రచారం చేశానే తప్పించి.. అసలు అలాంటిదేమీ లేదని చెప్పటంతో ధర్మస్థలిని డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా కుట్ర జరిగిన వైనం బయటకు వచ్చింది. దీని సూత్రధారులు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.