ధర్మస్థల కేసులో సంచలన మలుపు!

కానీ ఇటీవలి కాలంలో ఈ పవిత్ర స్థలం చుట్టూ ఆవిరైన కొత్త మిస్టరీ ఒక్కసారిగా బయటకు వచ్చింది.;

Update: 2025-08-05 07:23 GMT

ధర్మస్థల… కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మంజునాథ స్వామివారి ఆలయం ఉండే చోటు. ప్రతి ఏడూ లక్షలాది భక్తులు ఇక్కడకు విచ్చేస్తారు. గోవా వెళ్లే మార్గంలో ఉండటంతో పర్యాటకుల రద్దీ కూడా అధికంగా ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ఈ పవిత్ర స్థలం చుట్టూ ఆవిరైన కొత్త మిస్టరీ ఒక్కసారిగా బయటకు వచ్చింది. అందులో వందల మంది చనిపోయినట్టూ, వారి శవాలను పాతిపెట్టినట్టూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. దీనికి అధికారులు దృష్టి మళ్లించడం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

-ఊహించని నిజాలు వెలుగు చూస్తున్నాయా?

ఒక పారిశుద్ధ్య కార్మికుడు అధికారులకు ఇచ్చిన వివరాలు ప్రకారం.. వందల మంది శవాలను తానే స్వయంగా పాతిపెట్టాడని చెబుతూ "ఆ శవాల్లో చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్లను ఎవరు చంపారో నాకు తెలియదు. కానీ నేనేం చేయలేకపోయాను. మృతదేహాలను పాతిపెట్టమన్నారూ.. పాతిపెట్టాను" అని వెల్లడించడంతో అధికారులు షాక్ అయ్యారు.

-తవ్వకాల్లో పుర్రెలు, ఎముకలు లభ్యం..

ఈ సమాచారంతో వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. మొదటి దశ తవ్వకాల్లో అతడు సూచించిన కొన్ని చోట్ల వాస్తవంగా పుర్రెలు, ఎముకలు బయటపడడం ఈ కేసులో కొత్త మలుపు తెచ్చింది. ఇది నిజంగా పెనువివాదం అయ్యే సూచనగా మారింది. అయితే ఆ తర్వాత అదే కార్మికుడు చెప్పిన మరికొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనితో అతడు అబద్ధం చెబుతున్నాడా? లేక ఏదైనా మరొక ఆచూకీ కోల్పోయామా? అనే సందేహాలు మొదలయ్యాయి.

-తడబడుతున్న దర్యాప్తు.. వానలతో ఆటంకం

ప్రస్తుతం ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో తవ్వకాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పైగా వాస్తవంగా ఎక్కడెక్కడ శవాలు పాతిపెట్టబడ్డాయో స్పష్టంగా గుర్తించలేకపోతుండడంతో అధికారులు అంతర్మథనం చెంది ఉన్నారు.

- ఇంకా ఎన్నో ప్రశ్నలు – సమాధానాలు రాలేదు!

ఈ కేసు లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. శవాలెంత వరకు నిజంగా పాతిపెట్టబడ్డాయి? వీరిని ఎందుకు చంపారు? అంత దారుణంగా హింసించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గత 20 ఏళ్లలో 450 మంది మిస్సింగ్ కేసులు నమోదవడం ఇదే నేపథ్యంలోనా? గతంలో ఈ విషయాలు ఎందుకు బయటపెట్టలేదు? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

-దర్యాప్తుతో న్యాయం తేలుతుందా?

ఈ ఉదంతం పూర్తిగా వెలుగులోకి వస్తే, ఇది కేవలం ఒక మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపే కేసుగా మారే అవకాశముంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే SIT ఏర్పాటు చేసిన నేపథ్యంలో దర్యాప్తు సాగుతూనే ఉంది. కానీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినది నిజమేనా? లేక ఇందులో మరొక కుట్ర దాగి ఉందా? అనే అంశాలు తెలియాలంటే ఇంకా సమయం పట్టేలా ఉంది. ధర్మస్థల దిశగా జరుగుతున్న ఈ విచారణ మరెన్ని నిజాలు వెలికి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News