ఉప రాష్ట్రపతి పదవికి గుడ్‌ బై.. ధన్‌ ఖడ్‌ కంటే ముందు ఎంతమందో తెలుసా?

దీంతో... స్వతంత్ర భారత చరిత్రలో ఉప రాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వారిలో ధన్‌ ఖడ్‌ మూడో వారిగా నిలిచారు.;

Update: 2025-07-22 07:09 GMT

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారం రాత్రి రాజ్యసభ ఛైర్మన్ ధన్ ఖడ్.. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. సోమవారం రాత్రికల్లా తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపారు. ఈ సందర్భంగా... అనారోగ్య కారణాలవల్లే తాను పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన కంటే ముందు ఉప రాష్ట్రపతి పదవికి గుడ్ బై చెప్పినవారు ఎవరో చూద్దామ్...!

అవును... ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ ఖడ్‌ సోమవారం రాజీనామా చేశారు. వాస్తవానికి 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్‌ ఖడ్‌ కు, 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే రెండేళ్ల 344 రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో... స్వతంత్ర భారత చరిత్రలో ఉప రాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వారిలో ధన్‌ ఖడ్‌ మూడో వారిగా నిలిచారు.

ఈయనకంటే ముందు 1969లో వి.వి.గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం రాజీనామా చేయగా... 2007లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భైరాన్‌ సింగ్‌ శెకావత్‌ తన పదవీ కాలానికి నెల ముందుగా రాజీనామా చేశారు. ఇదే సమయంలో... రాష్ట్రప్తులుగా ఎన్నికయ్యాక ఆర్‌ వెంకట్రామన్ (1987), శంకర్‌ దయాళ్‌ శర్మ (1992), కె.ఆర్‌.నారాయణన్‌ (1997) ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు.. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 67(ఎ)కు అనుగుణంగా ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్ ఖడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా... బాధ్యతల నిర్వహణలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో... ప్రధాన మంత్రి, మంత్రి మండలికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఆ సంగతి అలా ఉంటే... ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన సోమవారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగా కనిపించినప్పటికీ.. రాత్రికి రాత్రి అదే కారణంతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోందని అంటున్నారు. ఈ సమయంలో.. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ.. అది కారణం కాకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ధన్‌ ఖడ్‌.. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజుతో సహా పలువురు హాజరయ్యారని అన్నారు. చర్చ అనంతరం సాయంత్రం 4:30కు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అయితే.. మరోసారి జరిగిన భేటీకి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు రాలేదని.. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ధన్‌ ఖఢ్‌ ఆ భేటీని మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే... సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4:30 గంటల మధ్య ఏదో పెద్ద విషయమే జరిగిందని జైరాం రమేశ్ అన్నారు.

Tags:    

Similar News