దేవినేని అవినాష్ ఆశ...జగన్ తీరుస్తారా ?
దీంతో దేవినేని అవినాష్ ఈసారి పెనమలూరు అసెంబ్లీ సీటు మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. అది గతంలో కంకిపాడుతో కలిసి ఉన్నది.
విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూకి ఒక ప్రత్యేకమైన పేజీ ఉంది. 1983లోనే తొలిసారి గెలిచిన యువ కెరటం ఆయన. ఆయన టీడీపీలో కీలకంగా మారి బెజవాడ రాజకీయాలను ఒక మలుపు తిప్పారు. ఇక అనేక సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టారు. ఆయన విజయవాడ రాజకీయాలను శాసించారు అని చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున విజయాలు అందుకున్నారు. అక్కడ దేవినేని నెహ్రూనే జనాలు చూసేవారు తప్పించి పార్టీలను కాదు. అంతలా బెజవాడ రాజకీయాల్లో పట్టుని సాధించిన నెహ్రూ వారసుడుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన దేవినేని అవినాష్ మాత్రం చట్ట సభలోకి ఈ రోజుకీ అడుగు పెట్టలేకపోవడం రాజకీయ విచిత్రమే అని అంతా అంటున్నారు.
కాంగ్రెస్ తోనే ఎంట్రీ :
ఇక దేవినేని నెహ్రూ కుమారుడిగా వారసుడిగా కాంగ్రెస్ తరఫున అవినాష్ 2014 లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ లోక్ సభకు పోటీ చేశారు. అయితే విభజన వల్ల కాంగ్రెస్ దెబ్బ తినడంతో ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన అవినాష్ 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కొడాలి నాని మీద ఓటమి పొందారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2024లో ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమినిని అందుకున్నారు. ఇలా మూడు ఎన్నికల్లో పోటీ చేసి మూడు చోట్లకు మారినా అవినాష్ ని పరాజయమే పలకరిస్తోంది తప్ప గెలుపు దారులు దొరకడం లేదని అంటున్నారు.
ఆ సీటుపైన కన్ను :
దీంతో దేవినేని అవినాష్ ఈసారి పెనమలూరు అసెంబ్లీ సీటు మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. అది గతంలో కంకిపాడుతో కలిసి ఉన్నది. కంకిపాడు అసెంబ్లీ దేవినేని నెహ్రూకి పెట్టని కోట. ఆయన అనేక సార్లు గెలిచారు. దాంతో తన తండ్రి వారసత్వం బలం అక్కడ కలసి వస్తుందని తనను గెలిపించి తీరుతుందని అవినాష్ బలంగా నమ్ముతున్నారు. దాంతో ఆయన అక్కడే తన కార్యక్షేత్రంగా మార్చుకుని వర్క్ స్టార్ట్ చేసారు అని అంటున్నారు. ఇక దేవినేని అవినాష్ విషయంలో జగన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది కూడా ఇక్కడ చర్చ సాగుతోంది.
ఎంపీగా పోటీకి :
వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా దేవినేని అవినాష్ ని పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. అవినాష్ అయితే యువకుడు అన్ని విధాలుగా దూసుకుని వెళ్తాడని పార్టీ భావిస్తోంది. అంతే కాదు విజయవాడ ఎంపీ సీటు గత మూడు ఎన్నికల్లోనూ వైసీపీకి చిక్కలేదు. మూడు ఎన్నికల్లో ముగ్గురుని మార్చినా గెలుపు మాత్రం అందుకోలేక వైసీపీ చతికిలపడింది. దాంతో యువకుడు నెహ్రూ రాజకీయ వారసుడిగా అవినాష్ ని పోటీకి దించాలని చూస్తోంది. మరి అవినాష్ అయితే పెనమలూరు మీద కన్ను వేశారు. ఈ విషయంలో జగన్ ఆయన మాట వింటారా ఆయన ఆశలు నెరవేరుస్తారా అన్నది చర్చగా ఉంది, ఇంకో వైపు చూస్తే పెనమలూరు మీద చాలా మంది వైసీపీ పెద్దల దృష్టి కూడా ఉంది అని అంటున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం అవినాష్ కి హామీ ఇస్తుందా లేక ఏమి జరుగుతుంది అన్నది అయితే చర్చగానే ఉంది.