డెలివరీ ఏజెంట్స్ లిఫ్ట్ వాడొద్దా.. ఇదేం దారుణం? ఏంటీ పైశాచికం
సమాజంలో మనుషుల మధ్య ఉన్న అసమానతలు కులం, మతం కంటే ఎక్కువగా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏర్పడుతున్నాయి.;
అర్ధరాత్రి రెండు గంటలకూ మెట్లు ఎక్కి రావాలంటూ అపార్ట్మెంట్ నిబంధనలు విధించడం… డెలివరీ బాయ్‌లు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులు మరోసారి సామాజిక చర్చకు దారితీశాయి. నగర జీవనశైలిలో సౌకర్యాలు పెరిగినా వాటిని అందించే కార్మికులకు మాత్రం కనీస గౌరవం దక్కడం లేదన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
సమాజంలో మనుషుల మధ్య ఉన్న అసమానతలు కులం, మతం కంటే ఎక్కువగా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏర్పడుతున్నాయి. డబ్బు ఉన్నవారికి మాత్రమే గౌరవం లభిస్తుండగా కష్టపడి జీవనం సాగించే వర్గాల పట్ల నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. “కూటికోసం కోటి తిప్పలు” అన్నట్లుగా చాలా మంది తమ కుటుంబాల కోసం ఎంతటి కష్టమైన పనైనా చేయడానికి వెనుకాడటం లేదు. అలాంటి వారిలో రైతులు, కూలీలు, డెలివరీ బాయ్‌లు ముఖ్యమైనవారు.
ప్రత్యేకంగా ఆన్లైన్ వాణిజ్యం విస్తరించిన తర్వాత డెలివరీ వ్యవస్థ మన జీవితంలో భాగమైంది. ఇంటి వద్దకే వస్తువులు అందించే డెలివరీ సిబ్బంది రోజుకు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణిస్తూ వర్షం–ఎండ తేడా లేకుండా పనిచేస్తున్నారు. అయితే వారికి ఎదురయ్యే గౌరవహీనత మాత్రం తగ్గడం లేదు. కొన్ని అపార్ట్మెంట్లలో డెలివరీ బాయ్‌లకు లిఫ్ట్ ఉపయోగించేందుకు అనుమతి లేకపోవడం.. వాడితే జరిమానాలు విధించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల ఒక డెలివరీ ఏజెంట్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ సమస్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అతను అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కూడా మెట్లు ఎక్కి డెలివరీ చేయాల్సి వచ్చిందని, లిఫ్ట్ వాడితే ఫైన్ వేస్తామని హెచ్చరించారని తెలిపాడు. ఈ ఘటన నెట్‌లో వైరల్ కావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే.. వారికి కనీస మర్యాద ఇవ్వాలి” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు పంటకు సరైన ధర రాకపోవడం, సమాజంలో గౌరవం దక్కకపోవడం బాధాకరం. అదే విధంగా రోజువారీ సేవలు అందించే గిగా వర్కర్లు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
గత ఎన్నికల సమయంలో గిగా వర్కర్ల కోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారి సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ గ్రౌండ్ లెవల్‌లో మార్పులు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని వారికి రక్షణ కల్పించే విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సమాజం కూడా తమకు సేవలు అందించే ఈ వర్గాల పట్ల మరింత మనుష్యత్వంతో వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. గౌరవం ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు, కానీ అది ఒక మనిషి గౌరవప్రదమైన జీవనానికి ఎంతో అవసరం.