ఢిల్లీ పేలుడు : 1000 అడుగుల దూరంలో తెగిపడిన చేయి.. భయానక దృశ్యాలు

దుకాణం పైకప్పుపై లభ్యమైన చేయి భాగం సహా సంఘటనా స్థలంలో దొరికిన అనేక శరీర భాగాలను గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.;

Update: 2025-11-13 12:58 GMT

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో జరిగిన భయంకరమైన పేలుడు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగినట్లు పోలీసులు తాజాగా ప్రకటించారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు, అధికారులు వివరిస్తున్న వివరాలు అక్కడి పరిస్థితి తీవ్రతను, పేలుడు శక్తి ఎంత ఘోరంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.

ఛిద్రమైన మృతదేహాలు.. కలవరపెడుతున్న దృశ్యాలు

బ్లాస్టింగ్ జరిగిన ఎర్రకోట పరిసరాల్లో మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దల్లా చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఘటన జరిగి కొన్ని గంటలు గడిచినా, శవ భాగాలు ఇంకా పరిసర ప్రాంతాల్లో లభిస్తూనే ఉన్నాయి. రక్షణ కార్యకర్తలు.. ఫారెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని అంగుళం అంగుళం పరిశీలిస్తున్నాయి.

*1000 అడుగుల దూరంలో తెగిపడిన చేయి

పేలుడు తీవ్రతకు నిదర్శనంగా నిలిచిన షాకింగ్ విజువల్ ఏమిటంటే... బ్లాస్ట్ జరిగిన ప్రదేశం నుండి దాదాపు 1000 అడుగుల (సుమారు 300 మీటర్లు) దూరంలో మానవ శరీర భాగం ఒకటి గుర్తించబడింది. ఎర్రకోట కారిడార్‌కు ఎదురుగా ఉన్న లజపతిరాయ్‌ మార్కెట్‌లోని ఓ దుకాణం పైకప్పుపై మోచేతి కింది భాగం వరకు ఉన్న చేయిని ఫోరెన్సిక్‌ అధికారులు తాజాగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

*DNA పరీక్షలతో గుర్తింపు ప్రయత్నం

దుకాణం పైకప్పుపై లభ్యమైన చేయి భాగం సహా సంఘటనా స్థలంలో దొరికిన అనేక శరీర భాగాలను గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. మృతదేహాలు దాదాపు గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో, ఫోరెన్సిక్ టీమ్‌లు వాటిని DNA టెస్టుల ద్వారా మృతుల్లో ఎవరివో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

*హైగ్రేడ్‌ పేలుడు పదార్థాలు వినియోగం

ఫోరెన్సిక్‌ నివేదికల ప్రకారం.. ఈ ఘటనకు హైగ్రేడ్‌ పేలుడు పదార్థాలను వినియోగించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలం నుంచి సేకరించిన దాదాపు 40 నమూనాల్లో బుల్లెట్లు, రెండు వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు వెల్లడించారు. వీటిలో ఒకటి అమ్మోనియం నైట్రేట్‌ను పోలినట్లుగా ఉండగా.. రెండోది దానికంటే శక్తిమంతమైనది అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

మృతుల పోస్ట్‌మార్టం నివేదికలోనూ పేలుడు తీవ్రత స్పష్టమైంది. చాలా మృతదేహాలపై బలంగా దెబ్బలు తగిలిన గాయాలు, అలాగే ఊపిరితిత్తులు, చెవులు, ఉదరభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు.

* ఉగ్రవాద కోణంపై దర్యాప్తు

పేలుడు ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఉగ్రవాద కోణాన్ని కూడా విచారణ బృందాలు పరిశీలిస్తున్నాయి. బ్లాస్ట్ సైట్ నుండి సేకరించిన ఆధారాలు, శరీర భాగాలు.. చుట్టుపక్కల ప్రాంతాల CCTV ఫుటేజీలు విశ్లేషణకు గురవుతున్నాయి. సోమవారం సాయంత్రం 6.50 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘోర పేలుడు, దేశ రాజధాని పౌరుల్లో తీవ్ర భయాందోళనను సృష్టించింది. మిలిటరీ, పోలీస్ దళాలు సంఘటన స్థలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి.

Tags:    

Similar News