ఫరీదాబాద్ లో బయలుదేరి.. ఎర్రకోట సిగ్నల్స్ వద్ద పేల్చేసే వరకు!

తీవ్ర సంచలనం.. అంతకు మించిన షాకింగ్ గా మారిన ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు ఉదంతానికి సంబంధించి దర్యాఫ్తు అధికారులు పలు విషయాల్ని గుర్తిస్తున్నారు.;

Update: 2025-11-12 04:47 GMT

తీవ్ర సంచలనం.. అంతకు మించిన షాకింగ్ గా మారిన ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు ఉదంతానికి సంబంధించి దర్యాఫ్తు అధికారులు పలు విషయాల్ని గుర్తిస్తున్నారు. పేలుడు జరిగిన కారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 6 గంటల పాటు.. అంటే పదకొండు గంటల పాటు ఎక్కడెక్కడ ప్రయాణించిందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అమాయకుల ప్రాణాల్ని మింగేసేందుకు పదకొండు గంటల పాటు ప్రయాణించిన వైనాన్ని గుర్తించారు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి జర్నీ చేయటమే కాదు.. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఈ కారును నిలిపిన వైనాన్ని గుర్తించారు. వివిధ టోల్ ప్లాజాలు.. సీసీ టీవీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో దర్యాప్తు టీంలు పలు ఆధారాల్ని సేకరించారు. కారు బాంబు పేలుడు సంభవించిన సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్ ఆసియన్ ఆసుపత్రి ఈ కారు కనిపించింది.

ఉదయం 8.13 గంటల వేళలో బదర్ పుర్ టోల్ ప్లాజాను దాటి ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి టోల్ ప్లాజా సిబ్బంది నుంచి రసీదు అందుకున్నట్లుగా గుర్తించారు. ఉదయం 8.30 గంటల ప్రాంతానికి ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకు వద్ద సీసీ టీవీ కెమేరాల్లో ఈ కారు నమోదైంది. పెట్రోల్ బంక్ బయట కాలుష్య ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న వైనాన్ని గుర్తించారు.

అదే రోజు సాయంత్రం 3.19గంటల ప్రాంతంలో ఎర్రకోట కాంప్లెక్స్ లోని పార్కింగ్ ప్రాంతానికి వచ్చి.. సునెహ్రీ మసీదు పార్కింగ్ ప్రాంతంలో సుమారు మూడు గంటల పాటు వెయిట్ చేశాడు ఉమర్. ఆ సమయంలో ఫరీదాబాద్ ఘటనలో అరెస్టులకు సంబంధించిన వార్తల్ని ఇంటర్నెట్ లో శోధించినట్లు గుర్తించారు. అనంతరం సాయంత్రం 6.22 గంటల ప్రాంతంలో పార్కింగ్ ప్రాంతం నుంచి బయటకు వచ్చి.. ఎర్రకోటవైపు కారును తిప్పాడు.

సరిగ్గా సాయంత్రం 6.52 గంటల వేళలో కారు పేలింది. ఈ మధ్యలో కారు ఎక్కడెక్కడ తిరిగిందన్న అంశంపై దర్యాప్తు అధికారులు ఫోకస్ చేశారు. పేలుడు ప్రాంతంలో గుర్తించిన శరీర భాగాలు ఉమర్ వేనా అన్న కోణంలో విచారిస్తున్న అధికారులు.. అతడి తల్లిని పుల్వామాలోని ఆసుపత్రికి తీసుకెళ్లి డీఎన్ఏ నమూనాల్ని సేకరించారు. ఆమెతో పాటు ఉమర్ సోదరులు (జహుర్, ఆషిక్ నబీ)లను కూడా అధికారులు విచారించారు.

పేలుడుకు ముందు శుక్రవారం ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి లైబ్రరీలో చదువుకుంటున్నట్లుగా చెప్పి.. తనకు కాల్ చేయొద్దని చెప్పినట్లుగా గుర్తించారు. అనంతరం తన ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేశాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని పోలీసులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్ లో ఉమర్ పని చేసిన ఆసుపత్రిలో అతడితో కలిసి పని చేసే పలువురు వైద్యుల్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా కారులో ఉమర్ తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

పేలుడుకు ఉపయోగించిన కారును అక్టోబరు 29న ఉమర్ నబీ కొనుగోలు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఫరీదాబాద్ నుంచి బయలుదేరి.. ఢిల్లీలో పేలుడు జరిగిన సమయం వరకు ఉమర్ తో పాటు కారులో ప్రయాణించిన ఇద్దరు బయటకు దిగలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కారు మొదటి యజమాని సల్మాన్ కు ఇంటిని అద్దెకు ఇచ్చిన దినేశ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News