కెమెరాకు చిక్కిన ఢిల్లీ బాంబుపేలుళ్లు..షాకింగ్ వీడియో
సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. సీసీటీవీ వీడియో ప్రకారం.. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ అవ్వడంతో వాహనాలు ఆగి ఉన్నాయి.;
దేశ రాజధాని దిల్లీ మరోసారి దుర్ఘటనకు వేదికైంది. చారిత్రక కట్టడం అయిన ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. సీసీటీవీ వీడియో ప్రకారం.. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ అవ్వడంతో వాహనాలు ఆగి ఉన్నాయి. అదే సమయంలో ఒక కారు నిదానంగా వచ్చి సిగ్నల్ వద్ద ఆగిన వెంటనే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
* మృత్యు భీభత్సం
పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కప్పుకుపోయింది. పేలుడు తీవ్రతకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, భయాందోళనకు గురైన ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీశారు. అధికారుల ధృవీకరణ ప్రకారం.. ఈ ఘోర పేలుడులో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీపంలోని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు విచ్ఛిన్నమై ఉండటంతో రక్షణ సిబ్బంది సైతం షాక్‌కు గురయ్యారు.
* కారు నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ
పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు సంభవించిన కారును నడిపిన వ్యక్తి జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా నిర్ధారణ అయింది. ప్రాథమిక విచారణలో ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసుతో ఉమర్‌కు సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను పట్టుబడిపోతాననే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా లేదా బాంబు తరలిస్తుండగా యాదృచ్ఛికంగా పేలిందా అన్నదానిపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే ఇది ముందస్తుగా ప్రణాళిక చేసిన సంఘటితం దాడి కాదని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు.
పేలుడు పదార్థాలు ఏమై ఉండొచ్చు?
నిపుణుల అంచనా ప్రకారం, కారులో అమ్మోనియం నైట్రేట్తో పాటు ఇతర రకాల ఇంధన పదార్థాలు, డిటొనేటర్లు ఉన్న అవకాశం ఉంది. పూర్తిస్థాయి బాంబు సిద్ధం చేసి ఉంటే, విధ్వంసం మరింత తీవ్రంగా జరిగేదని అధికారులు చెబుతున్నారు.
దర్యాప్తులో ఎన్ఐఏ, స్పెషల్ సెల్
ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. పేలుడు వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యం, ఆపరేటివ్ నెట్‌వర్క్ వివరాలు వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలు నియమించబడ్డాయి.
ఈ ఘటన దేశవ్యాప్తంగా భయాందోళన కలిగిస్తుండగా ప్రభుత్వం అత్యంత గంభీరంగా స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎర్రకోట పేలుడు కేసు పై దర్యాప్తు మరింత వేగం అందుకోనుంది.