ఢిల్లీ బ్లాస్ట్ కేస్...అనంత్ నాగ్ అడవులకు లింక్...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ సంఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన విచారణలో ఎన్నో కుట్రలు, రహస్యాలు బట్టబయలవుతున్నాయి.;

Update: 2025-12-09 10:30 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ సంఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన విచారణలో ఎన్నో కుట్రలు, రహస్యాలు బట్టబయలవుతున్నాయి. ఢిల్లీ పేలుడుకు ...జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా అడవుల్లో రహస్య స్థావరాలకు లింక్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఆ దిశగా సోదాలు నిర్వహించింది. ఢీల్లీ పేలుడు కుట్ర కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ అదీల్, జాసిర్ బిలాల్ లను పోలీసుల సాయంతో ఎన్ ఐఏ అధికారులు అనంతనాగ్ కు తరలించినట్లు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో సుమారు 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. అంతకుముందు ఫరీదాబాద్‌లో భగ్నం చేసిన ఉగ్రకుట్రతో ఢిల్లీ పేలుడు ఘటన ముడిపడి ఉన్నట్లు భద్రతా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డా. ఉమర్ మహ్మద్ తన సహచరులు అరెస్ట్ కావడంతో, భయాందోళనకు గురై ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఈ పేలుడుకు కొద్ది గంటల ముందు ఫరీదాబాద్‌లో ఒక భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్‌కు సన్నిహితులైన డా. ముజామిల్ షకీల్ డా. ఆదీల్ అహ్మద్ రథర్‌తో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరు జేష్-ఎ-మహ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందినవారని తెలుస్తోంది.

మట్టన్ అటవీ ప్రాంతంలో ఉగ్రమూఠాలు తలదాచుకునే పలు రహస్య స్థావరాలున్నాయని నిందితులు సమాచారం అందించారు. దీన్ని అనుసరించి దర్యాప్తు అధికారులు అనుమానిత వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. కేసులో ప్రమేయమున్న మరికొందరిని కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సహకారంతో దర్యాప్తు అధికారులు జమ్ము కశ్మీర్ లో సోదాలు చేపడుతున్నారు. కాగా ప్రేమ విఫలమైన ఓ యువతి తన మాజీ ప్రియుడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే ఢిల్లీ ఉగ్రవాద కుట్ర బయటపడిందని .... 23వ హిందుస్తాన్ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమార్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

Tags:    

Similar News