బూచేపల్లి బేఫికర్.. వైసీపీకి పండగే ..!
ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అది వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.;
ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అది వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇటువంటి నియోజకవర్గాల్లో నాయకులకు ఎదురులేదన్నమాట తరచుగా వినిపిస్తూ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం విశేషం. వాస్తవానికి వైసీపీకి చెందిన బూచేపల్లి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు.
అయితే ప్రత్యర్థి పక్షం కాబట్టి ఆయనకి ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురవుతాయని అందరూ భావించారు. సాధారణంగా విపక్షం గెలిచిన చోట పరిస్థితులు అలాగే ఉంటాయి. ఉదాహరణకు వైసీపీ విజయం దక్కించుకున్న చోట టిడిపి నేతల ఆదిపత్యం లేదా జనసేన నాయకుల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దర్శి నియోజకవర్గంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా చాలా సునాయాసంగా బూచేపల్లి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. గతంలో దర్శి అంటే అనేక వివాదాలకు విమర్శలకు కేంద్రంగా మారింది. సొంత పార్టీలోనే విమర్శలు చేసేవారు, సొంత పార్టీలో ఉండి ఇతర పార్టీల తరఫున పని చేసిన నాయకులు కూడా ఉన్న నియోజకవర్గంగా దర్శికి పేరు ఉంది.
కానీ ప్రస్తుతం దర్శి లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుల హవాకాని, కూటమి పార్టీలకు సంబంధించిన నేతల జోరుగాని పెద్దగా లేదు. గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ లక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక టిడిపిలో ఒకప్పుడు బలమైన నాయకుడిగా ఉన్న సిద్ధ రాఘవరావు తర్వాత వైసీపీలోకి వచ్చి మళ్ళీ టిడిపిలోకి వెళ్లారు. అయితే ఆయనకు టిడిపిలో పెద్దగా గుర్తింపు అయితే లభించడం లేదు. దీంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు బొత్తిగా ప్రాధాన్యం లేదన్నట్టుగా ఎవరి పనివారు చేసుకున్నారు. దీంతో దర్శి నియోజకవర్గంలో బూచేపల్లికి తిరుగులేకుండా పోయింది. ఇది మంచి పరిణామం.
ఇదే సమయంలో ఆయన కూడా ప్రజలకు చేరువుగానే ఉంటున్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఆయన మాతృమూర్తి ఉండడంతో సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక బూచేపల్లిని వ్యతిరేకించే వర్గాలు పెద్దగా లేకపోవడంతో పాటు రెడ్డి సామాజిక వర్గంలోనూ ఆయన పట్ల వ్యతిరేకత లేని నేపథ్యంలో నియోజకవర్గంలో పనులు కూడా సాఫీగానే జరుగుతున్నాయి. ఇతర నియోజకవర్గాల మాదిరిగా రెచ్చగొట్టే ధోరణిలో, రెచ్చగొట్టే రాజకీయాలు ఇక్కడ కనిపించకపోవడం విశేషం.
ఇదే విషయాన్ని తాజాగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రస్తావించారు నియోజకవర్గంలో పనులు ఎలా జరుగుతున్నాయని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. అంతా బాగానే ఉందని తమకు ఎలాంటి ఇబ్బంది లేదని బూచేపల్లి చెప్పుకు రావడం విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలు వివాదాలు అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి. తప్ప భారీ స్థాయిలో ఎమ్మెల్యేను ప్రభావితం చేసే స్థాయిలో అయితే ఇతర నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయాలు ఇక్కడ లేకపోవడం గమనార్హం.