రోజుకో కోటి ... సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు
టెక్నాలజీ పెరుగుతోంది అని మురిసిపోతున్నారు ఆ వెంటనే వచ్చే అనర్ధాలు కూడా కొంప ముంచుతున్నాయి.;
టెక్నాలజీ పెరుగుతోంది అని మురిసిపోతున్నారు ఆ వెంటనే వచ్చే అనర్ధాలు కూడా కొంప ముంచుతున్నాయి. బ్యాంకులకు వెళ్ళి క్యూలో నిలబడి సొమ్ములు తీసుకోవడం ఒక నాటి బాధ. అది తప్పింది, హాయిగా మన ఫోన్ లోనే స్మార్ట్ గా డబ్బులు జస్ట్ సెకన్ వ్యవధిలో ఎదుటి ఖాతాలో వేసి ఖర్చు పెట్టొచ్చు, ఎవరికైనా ఇవ్వొచ్చు. ఇదంతా బాగానే ఉన్నా దీని వెనకనే సైబర్ భూతం కూడా పొంచి ఉంది. ఈ లావాదేవీల వెనకనే పొంచి చూస్తూ వల పన్ని మరీ ఖాతాను కబ్జా చేస్తోంది. సైబర్ నేరగాళ్ళు కొత్త ఎత్తులు వేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. దాంతో ఖాతాలో సొమ్ము అలా జారిపోతూంటే లబోదిబో అనాల్సి వస్తోంది అమాయకులు.
ఓల్డ్ పీపుల్ టార్గెట్ :
ఎక్కువగా వృద్ధులు టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎంతో ఘనమైన పదవులు నిర్వహించి రిటైర్ అయిన వృద్ధులకు ప్రభుత్వ పెన్షన్ వస్తుంది. అలాగే బిడ్డలు విదేశాల్లో ఉంటూ పంపించే లక్షల సొమ్ము జమ అవుతోంది. దానినే దృష్టిలో ఉంచుకుని సైబర్ గాళ్ళు టోకరా వేస్తున్నారు.
డేటాతో సహా :
సైబర్ నేరగాళ్ళు ఒక డేటాను దగ్గర పెట్టుకుని మరీ నేరాలకు పాల్పడుతున్నారు. టార్గెటెడ్ బాధితులను ముందే సిద్ధం చేసుకుంటున్నారు. అలా వారి డేటాలో చూస్తే కనుక వ్యక్తుల సంపద, వయసు, చిరునామా వంటి వివరాలు ఉంటున్నాయి. వాటిని వారు చలా ఈజీగా సేకరిస్తున్నారు. ఆ మీదట టార్గెటెడ్ పర్సన్స్ ని ఎంచుకుని మరీ ఫోన్ కాల్స్ చేయడం, సోషల్ మీడియా ద్వారా వారితో పరిచయం పెంచుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఒంటరిగా ఉండే మహిళలు వీరి ప్రధాన టార్గెట్ అయితే ఆ తరువాత వరసలో వృద్ధులు ఇళ్ళలో ఉండే గృహిణులు ఉంటున్నారు. వీరినే టార్గెట్ గా పెట్టుకుని వారిని బెదిరించి మరీ ఖాతాను ఖాళీ చేస్తున్నారు
సవాల్ గా మారింది :
నేరాలు ఒకపుడు ఫిజికల్ గా ఉండేవి, ఇపుడు కంటికి కనిపించకుండా జరిగిపోతున్నాయి. టెక్నాలజీ తో సవాల్ గా మారిన ఈ సైబర్ నేరాలను అతి తీవ్రమైన సామాజిక సమస్యగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విధంగా రోజుకు వచ్చే ఫిర్యాదులు అధికం అవుతున్నాయి. దాంతో ఒక్క హైదరాబాద్ లాంటి నగరంలోనే రోజుకు కోటి రూపాయలు దాకా సైబర్ నేరగాళ్ళు కొల్లగొడుతున్నారు అని పోలీసులు చెబుతున్నారు.
అప్రమత్రమే ఉత్తమం :
సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడాలీ అంటే పోలీసులతో పాటుగా ప్రజలలో అప్రమత్తత కూడా అత్యవసరం అని అంటున్నారు. సైబర్ మోసాల గురించిన ప్రాథమిక అవగాహన ఉన్న వారే వీటి బారిన పడకుండా ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యం చేసే విషయంలో తాము చేయాల్సింది చేస్తున్నామని చెబుతున్నారు. ఉర్ ఇక తాజాగా హైదరాబాద్‌లో జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ సింబా లోగో క్యూఆర్ కోడ్‌ను సైతం పోలీసులు ఆవిష్కరించారు. ప్రజలు ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930కి కాల్ చేయాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలలో అవగాహన లేమితో పాటు అమాయకత్వం ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళ ఆటకట్టించేందుకు పోలీసులతో కలసి ప్రజలు అడుగులు వేయాలని కోరుతున్నారు. అనుమాస్పదంగా కనిపించే లింకులను ఓపెన్ చేయవద్దని, సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయం చేసుకోవద్దని, ఎవరికీ తమ బ్యాంక్ ఖాతాలు వ్యక్తిగత వివరాలు ఓటీపీ నంబర్లు అసలు చెప్పరాదని పోలీసులు సూచిస్తున్నారు.