సైబర్ నేరగాళ్ల బారిన టీడీపీ ఎమ్మెల్యే... రూ. కోటిపైనే దోపిడీ!
అవును... వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.;
ఇంతకాలం ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను, విదేశాల నుంచి వచ్చిన వారిని రకరకాల సమస్యల పేరు చెప్పి.. సీబీఐ, ఈడీ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని చెప్పి డిజిటల్ అరెస్టులు చేసి దోచుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి, సక్సెస్ అయిన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
అవును... వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసముంటున్న సుధాకర్ యాదవ్ కు.. తాము ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్పి ఓ వ్యక్తి కాల్ చేశాడు. తార్వాత రకరకాల కారణాలు చెప్పి బెదిరించాడు.
సుధాకర్ ఫిర్యాదు ప్రకారం... అక్టోబర్ 10న ఉదయం 7:30 గంటలకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు చెందిన అధికారిగా చెప్పుకునే గౌరవ్ శుక్లా అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ముంబైలో ఎమ్మెల్యేపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. బాంద్రాలో కొనుగోలు చేసిన ఆ ఎయిర్ టెల్ సిమ్ కార్డు అక్రమ లావాదేవీలకు సంబంధించినదని ఫోన్ లోని వ్యక్తి చెప్పాడు.
అనంతరం... కొన్ని నిమిషాల తర్వాత విక్రమ్ అని పరిచయం చేసుకుంటున్న మరొక వ్యక్తి.. సైబర్ క్రైమ్ దర్యాప్తు అధికారిగా చెప్పుకుంటూ వాట్సాప్ వీడియో కాల్ లోకి వచ్చాడు. అతడు నకిలీ అరెస్ట్ వారెంట్, బ్యాంక్ అకౌంట్ స్తంభింపజేసే సీబీఐ ఆర్డర్, సడకత్ ఖాన్ అనే అక్రమ రవాణా నిందితుడి ఫోటోను చూపించాడు.
ఈ సందర్భంగా... మీ పేరు మీద తెరిచిన కెనరా బ్యాంక్ ఖాతాలోకి రూ.3 కోట్లు లాండరింగ్ నిధులు బదిలీ అయ్యాయని, సహకరించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని సుధాకర్ యాదవ్ కు చెప్పాడు. దీంతో భయాందోళనలకు గురైన ఎమ్మెల్యే అక్టోబర్ 10 - 15 మధ్య తొమ్మిది దఫాలుగా రూ.1.07 కోట్లు బదిలీ చేశారు. దీనిద్వారా తాత్కాలిక బెయిల్ అందుతుందని వారు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా కోర్టు క్రియరెన్స్ సర్టిఫికెట్ హామీ ఇచ్చిన తర్వాత స్కామర్లు మరో రూ.60 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు ఎమ్మెల్యే గ్రహించారని అంటున్నారు. దీంతో... వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.