ఏపీలో కరివేపాకు ఎగుమతులతో రూ.100 కోట్ల ఆదాయం
కూరలో కరివేపాకు అని సింఫుల్ గా తీసిపారేస్తుంటారు కొందరు. కానీ.. అదే కూరలో కరివేపాకు ఏపీకి తీసుకొస్తున్న ఆదాయం గురించి తెలిస్తే నోట మాట రాదంతే.;
కూరలో కరివేపాకు అని సింఫుల్ గా తీసిపారేస్తుంటారు కొందరు. కానీ.. అదే కూరలో కరివేపాకు ఏపీకి తీసుకొస్తున్న ఆదాయం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. చిన్న కట్ట చేతికి ఇచ్చి రూ.5.. రూ.10 తీసుకోవటం అందరికి అలవాటే. కానీ.. అలాంటి సింఫుల్ కట్టలతో కోట్లాది రూపాయిల వ్యాపారం జరుగుతుందన్న విషయం చాలామందికి తెలీదు. అంతేకాదు.. ఈ కరివేపాకును ఎగుమతుల ద్వారా భారీగా విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. గుంటూరు జిల్లాలో మొదలైన కరివేపాకు సాగు.. ఇప్పుడు ఏపీలోని పలు జిల్లాలకు విస్తరించటమే కాదు.. విదేశాలకు సైతం భారీగా ఎగుమతి చేస్తున్నారు.
అధికారుల లెక్కల ప్రకారం ఏపీలో మూడు వేల ఎకరాల్లో కరివేపాకు సాగు జరుగుతోంది. అయితే.. అనధికారిక లెక్కల ప్రకారం కరివేపాకు సాగు చేస్తున్న భూవిస్తీర్ణం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కరివేపాకు మెట్రిక్ టన్నుకు గరిష్టంగా రూ.30 - రూ.40 వేల వరకు ధర లభిస్తుందని చెబుతున్నారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు మంచి ధర ఉంటుందని.. మిగిలిన సమయాల్లో మాత్రం రూ.10వేలు - రూ.30వేల మధ్యలో ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
ఏపీలోని గుంటూరు జిల్లా పెదవడ్లపూడి గ్రామం కరివేపాకు సాగుకు చాలా ఫేమస్. అక్కడి రైతులు కరివేపాకును వాణిజ్య పంటగా సాగు చేయటం మొదలుపెట్టి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగు చేయటం షురూ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి.. పెద్దపప్పూరులో భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి.. వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతాల్లో కరివేపాకును భారీ ఎత్తున సాగు చేస్తున్నారు
ఎకరం విస్తీర్ణంలో కరివేపాకును సాగు చేసేందుకు ఏడాదికి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఏడాది వ్యవధిలో 20 మెట్రిక్ టన్నుల వరకు కరివేపాకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా పండించిన కరివేపాకును.. నిత్యం రాష్ట్రంలోని అన్ని నగరాలు.. పట్టణాలతో పాటు దేశంలోని చెన్నై. బెంగళూరు.. హైదరాబాద్.. ముంబయిలకు డైలీ బేసిస్ లో పంపుతుంటారు. ఒక్కో లారీలో నాలుగున్న టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు) పంటను లోడ్ చేసి పంపుతారు. ఇటీవల కాలంలో దుబాయ కు పెద్ద ఎత్తున ఎగమతి అవుతుంది. కరివేపాకులో ఉన్న మేజిక్ ఏమంటే.. ఒకసారి విత్తు వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి చేతికి వస్తుందని.. దీర్ఘకాలం పాటు అదే పనిగా ఆదాయ వనరు కల్పించే పంటగా చెబుతున్నారు. కూరలో కరివేపాకు అని సింఫుల్ గా తీసేయకుండా.. దీని సంగతేమిటి? అన్నది చూస్తే.. వెలుగు చేసే వివరాలు ఆసక్తికరంగా ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు.