పాక్ మహిళను పట్టుకొచ్చి ఇండియాలో.. సీఆర్పీఎఫ్ జవానుపై వేటు
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ వ్యవహారం వెలుగుచూడటం ప్రాధాన్యత సంతరించుకుంది;
పాకిస్థాన్‌కు చెందిన మహిళను రహస్యంగా వివాహం చేసుకోవడమే కాకుండా ఆమె వీసా గడువు ముగిసినా దేశంలోనే ఆశ్రయం కల్పించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్‌ను సర్వీస్ నుంచి తొలగించారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ వ్యవహారం వెలుగుచూడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌కు చెందిన మునీర్ అహ్మద్ అనే జవాన్, గత సంవత్సరం మే నెలలో వీడియో కాల్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన మినాల్ ఖాన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ విషయాన్ని అతను తన ఉన్నతాధికారులకు తెలియజేయకుండా గోప్యంగా ఉంచాడు. వివాహం తర్వాత మినాల్ ఖాన్ స్వల్పకాలిక వీసాపై భారతదేశానికి వచ్చి, మునీర్ అహ్మద్‌తో కలిసి నివసించడం ప్రారంభించింది.
అయితే, ఆమె వీసా గడువు ఈ సంవత్సరం మార్చి 22వ తేదీతో ముగిసింది. వీసా గడువు ముగిసినా ఆమె ఇక్కడే ఉంటోంది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారుల తనిఖీలలో భాగంగా మునీర్ అహ్మద్ భార్య వివరాలు వెలుగులోకి వచ్చాయి. వీసా గడువు ముగిసినా ఆమె దేశంలోనే అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు.
ఈ విషయం సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో అంతర్గత విచారణ చేపట్టారు. విచారణలో మునీర్ అహ్మద్ తన వివాహ విషయాన్ని గోప్యంగా ఉంచడం, వీసా నిబంధనలు ఉల్లంఘించి విదేశీయురాలికి ఆశ్రయం కల్పించడం వంటి తీవ్రమైన తప్పిదాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. అతని చర్యలు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలలో బాధ్యతారాహిత్యాన్ని చూపాయని ఉన్నతాధికారులు భావించారు.
దీంతో మునీర్ అహ్మద్‌ను తక్షణమే సర్వీస్ నుంచి తొలగిస్తూ సీఆర్పీఎఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. "పాకిస్థానీ జాతీయురాలితో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టడంతో పాటు, వీసా గడువు ముగిసిన మహిళకు ఆశ్రయం కల్పించడం వంటివి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన. జాతీయ భద్రతకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ఈ కఠిన చర్యలు తీసుకున్నాం" అని సీఆర్పీఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మరోవైపు తన వివాహం గురించి ఉన్నతాధికారులకు తెలియజేశానని.. అనుమతి కూడా లభించిందని మునీర్ అహ్మద్ వాదిస్తున్నట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. తన తొలగింపును న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్లు కూడా అతను తెలిపినట్లు సమాచారం. అయితే, అధికారికంగా సీఆర్పీఎఫ్ మాత్రం నిబంధనల ఉల్లంఘన.. జాతీయ భద్రతా కారణాలనే తొలగింపునకు కారణాలుగా పేర్కొంది. పహల్గాం దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమైన సమయంలో ఇటువంటి ఘటన వెలుగుచూడటం భద్రతా వర్గాలలో చర్చనీయాంశమైంది.