హోం లోన్.. ప్రభుత్వ బ్యాంకుల వైపే జనం

మిగిలిన ఆర్థిక అవసరాల కోసం ప్రైవేటు బ్యాంకుల వైపు వెళ్లటం కామన్. కానీ.. హోంలోన్ విషయంలో మాత్రం ప్రైవేటు కంటే ప్రభుత్వ బ్యాంకులకే జై కొడుతున్న వైనం తాజా రిపోర్టు స్పష్టం చేసింది.;

Update: 2025-09-04 05:30 GMT

అవసరాలకు బదులు తీసుకోవటం ఎంత కామనో.. ఇంటిని కొనుగోలు చేసే వేళ లోన్ అన్నది కామన్. మరి.. హోంలోన్ తీసుకునేందుకు ఏ బ్యాంకుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న దానిపై తాజాగా ఒక రిపోర్టు వెల్లడైంది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మిగిలిన ఆర్థిక అవసరాల కోసం ప్రైవేటు బ్యాంకుల వైపు వెళ్లటం కామన్. కానీ.. హోంలోన్ విషయంలో మాత్రం ప్రైవేటు కంటే ప్రభుత్వ బ్యాంకులకే జై కొడుతున్న వైనం తాజా రిపోర్టు స్పష్టం చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికం (ఏప్రిల్ -జూన్) హోంలోన్ల జారీలో ప్రభుత్వ బ్యాంకుల వాటా 46.2 శాతం కావటం గమనార్హం. గత ఏడాది ఇదే నాటికి ప్రభుత్వ బ్యాంకుల హోం లోన్ వాటా 37.6 శాతం కావటం గమనార్హం. అదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల హోంలోన్ వాటా 35.2 శాతం నుంచి 28.2 శాతానికి తగ్గిపోయింది. ఈ వివరాల్ని క్రెడిట్ బ్యూరో సంస్థ క్రిఫ్ హైమార్క్ విడుదల చేసింది.

ఇక్కడో ఆసక్తికర అంశముంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల హోం లోన్ లో 31-90 రోజుల వరకు చెల్లింపులు లేని రుణాలు 2.85 శాతానికి చేరినట్లు రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రైవేటు బ్యాంకులో ఇలా వసూలు కాని రుణాలు 1.04 శాతమే ఉన్నట్లుగా వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకులు రిస్కుల్ని ముందుగా గుర్తించటం.. బలమైన అండర్ రైటింగ్ ప్రమాణాల్ని పాటించటం దీనికి కారణంగా చెబుతున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే హోంలోన్ లో రూ.35 లక్షల కంటే తక్కువ రుణాల చెల్లింపులే నిలిచినట్లుగా పేర్కొన్నారు. బ్యాంకులు చిన్న రుణాల కంటే పెద్ద పరిమాణంలో ఉన్న హోం లోన్ మంజూరుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. రూ.75 లక్షల పైబడిన రుణాల మంజూరు 38 శాతానికి చేరగా.. గత ఏడాది ఇదే కాలంలో అది 33.6 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో రూ.5 -55 లక్షల లోపు హోంలోన్ రుణాల మంజూరు 34.7 శాతం నుంచి 31.2 శాతానికి తగ్గాయి.

హోంలోన్ కు సంబంధించిన అంశాలు ఇలా ఉంటే.. ఇదే రిపోర్టు మరో ఆసక్తికకర అంశాన్ని వెల్లడించింది. కొత్త క్రెడిట్ కార్డుల మంజూరు గత ఏడాది ఏప్రిల్ - జూన్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది 28 శాతం తగ్గటం గమనార్హం. ఆర్ బీఐ నియంత్రణ కఠినంగా ఉండటం.. బ్యాంకులు రిస్కు ధోరణి తగ్గటం.. రుణ ఆస్తుల పటిష్టతపై ఫోకస్ పెట్టటంతో క్రెడిట్ కార్డుల జారీలో ప్రభుత్వ బ్యాంకులు జోరు తగ్గితే.. ప్రైవేటు బ్యాంకుల వాటా పెరిగింది. గత ఏడాది 71 శాతంగా ఉంటే.. ఈ ఏడాది అది కాస్తా 75 శాతానికి పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది.

Tags:    

Similar News