ప్రొఫెసర్ నాగేశ్వర్ సీఎం అవుతారు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలపై రెండు రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణ తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

Update: 2026-05-22 09:55 GMT

జనసేన, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య వివాదంలో సీపీఐ నారాయణ ఎంట్రీ ఇచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బాసటగా నిలవడమే కాకుండా, జనసేన ఫిర్యాదులతో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేస్తే ఆయన సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్, జనసేన మధ్య వివాదం మరో టర్న్ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రొఫెసర్ పై ఫిర్యాదులు చేస్తున్న జనసేన పార్టీ విధానం చూస్తుంటే ప్రశ్నించే గొంతును నొక్కడమేనంటూ నారాయణ విశ్లేషించారు. ప్రొఫెసర్ కు మద్దతుగా కాక్రోచ్ లు అంతా బయటకు వస్తారు. ఆయన సీఎం అభ్యర్థి అవుతారంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలపై రెండు రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణ తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రొఫెసర్ నాగేశ్వర్ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారశైలిని ప్రశ్నించడంతో ఆయన ఈ రోజు ఉదయమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు నాగేశ్వర్ పై జనసేన నేతలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కేసులు పెడుతున్నారు.

ఇప్పటికే నాగేశ్వర్ కామెంట్లపై కాకినాడతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని అంటున్నారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ ను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని చెబుతున్నారు. దీనిపై సీపీఐ నారాయణ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ప్రకటిస్తూ నారాయణ ఒక వీడియోను విడుదల చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన దాంట్లో తప్పుంటే ఖండించాలి. అంతేకాని పోలీసు కేసులు పెట్టి అరెస్టుచేస్తారని బెదిరించడం ఏంటి? అంటూ నారాయణ ప్రశ్నించారు. ప్రొఫెసర్ ను అరెస్టు చేస్తే చేసుకోండి ఏమవుతుంది? ఆయన సీఎం అభ్యర్థిగా బయటకు వస్తారు. కాక్రోచ్ లు అంతా ఆయనకు మద్దతుగా నిలుస్తారంటూ నారాయణ విశ్లేషించారు.

తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయనకు తటస్థుడిగా గుర్తింపు ఉన్నప్పటికీ గతంలో సీపీఐతో ఉన్న అనుబంధం కారణంగా నారాయణ చొరవ తీసుకుని ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా నిలిచారని అంటున్నారు. అయితే ఆయనను ఏపీ పోలీసులు అరెస్టు చేస్తే సీఎం అభ్యర్థిగా బయటకు వస్తారని చెప్పడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేస్తే ఆయన ఏ రాష్ట్రానికి సీఎం అభ్యర్థి అవుతారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోన్న కాక్రోచ్ జనతా పార్టీని ఆకర్షించేందుకు సీపీఐ నారాయణ ప్రయత్నించడం కూడా రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. కాక్రోచ్ లు అంటే యువతరం అంతా ప్రొఫెసర్ నాగేశ్వర్ వైపు నిలుస్తుందని నారాయణ చెప్పడంపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు చేస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News