ప్రపంచ నిరుద్యోగంలో ఇండియా ప్లేస్ అదే ?
మనిషి జీవించడానికి ఉపాధి కావాలి. అది శాశ్వతమైనది అయితే ఆ బతుకు బంగారమే. ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ఉంటాయి.
మనిషి జీవించడానికి ఉపాధి కావాలి. అది శాశ్వతమైనది అయితే ఆ బతుకు బంగారమే. ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్ లోనూ అలాంటి పరిస్థితి ఉంటే కూడా హ్యాపీ. మరి ఈ రెండు సెక్టార్లలో జాబ్స్ లేకపోతేనే నిరుద్యోగం విపరీతమై పోతుంది. అసంఘటిత రంగంలో పని చేసినా అది సరైన జీవితాన్ని ఇవ్వదు, దాన్ని ప్రచ్చన్న నిరుద్యోగం అంటారు. ఇలా ప్రపంచంలో నిరుద్యోగంతో పోరాటం చేస్తున్న యువత వందల కోట్లలోనే ఉన్నారు. మరి మొత్తం ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ రేటుతో ఒక దేశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
నిరుద్యోగానికి కేరాఫ్ గా :
ఇదిలా ఉంటే నిరుద్యోగం అంటే కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దేశం ప్రపంచంలో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నది తాజాగా విడుదలైన అంతర్జాతీయ గణాంకాల ప్రకారం చూస్తే కనుక ఆఫ్రికాలోని చిన్న దేశమైన ఎస్వాటినిలో అని తెలుస్తోంది. అక్కడ ఏకంగా 37 శాతానికి నిరుద్యోగం రేటు చేరిపోయింది. దాంతో ఉపాధి లేక అక్కడ యువత అల్లల్లాడుతోంది అన్న మాట. ఇక నిరుద్యోగంలో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో ఉంది అని నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో 32 శాతానికి పైనే నిరుద్యోగం రేటు ఉందని లెక్కలు చెబుతున్నాయి.
కారణాలు ఇవేనా :
ఇలా నిరుద్యోగంలో తొలి రెండు టాప్ ర్యాంకులను అందుకున్న ఆఫ్రికా దేశాల్లో ఎందుకీ పరిస్థితి అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. చుట్టూ అత్యధిక భూభాగం ఉన్నా కూడా ఎస్వాటినిలో ఆర్ధిక వ్యవస్థలో అనేక అసమానతలు ఉన్నాయని అంటున్నారు. దాంతో కొన్ని రంగాలకే ఉపాధి అవకాశాలు పరిమితం అయిపోయాయి. ఇక అక్కడ యువతకు తగినన్ని జాబ్స్ ని అందించడంలో ఎస్వాటినిలో విఫలం అవుతోంది. అందుకే అక్కడ ఏకంగా 37 శాతానికి నిరుద్యోగం చేరింది. అలాగే ఇదే ఆఫ్రికా ప్రాంతంలోని జిబౌటి, బోట్స్వానా వంటి దేశాల్లోనూ నిరుద్యోగం భారీగానే ఉంది అని అంటున్నారు. ఏకంగా 20 శాతం నుంచి 26 శాతానికి ఈ దేశాలలో నిరుద్యోగం ఉంది అని నివేదికలు చెబుతున్నాయి. ఇక అంతర్గతమైన సమస్యతో పాటు నిరంతరం అస్థిరతతో సతమతమవుతునన్ సూడాన్‌లో భవిష్యత్తులో నిరుద్యోగం రేటు ఏకంగా 60 శాతం దాటవచ్చని కూడా అంచనా వేస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే మరి.
ఇండియాలో సైతం :
ఇక ఆఫ్రికన్ దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ రోజుకు భారత్ లో నిరుద్యోగం కొంత తక్కువగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దానికి మించిన తీవ్రమైన సమస్య కూడా ఇండియాలో ఉందని అంటున్నారు. భారతదేశంలోని మొత్తం నిరుద్యోగులలో దాదాపుగా 80 శాతం పైగా 15 నుంచి 29 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారు ఉన్నారని అంటున్నారు. వీరంతా మంచి చదువు చదువుకున్నా జాబ్స్ లేవు. దాంతో మెరికల్లాంటి దేశీయ యువత తమ చదువుకు తగిన పని లేక అల్లల్లాడిపోతోంది. వీరిని సక్రమంగా ఉపయోగించుకోవడంలోనే దేశం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ వయసు చాలా దూకుడుగా ఉంటుంది. వారిని సమాజ హితం వైపుగా మరల్చాలి అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో అయినా దండీగా వచ్చేలా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది అని అంటున్నారు.
అధిక నిరుద్యోగం వెనక :
ఇక వివిధ దేశాంలో నిరుద్యోగం అధికంగా ఉండడానికి కారణాలు ఏమిటి అన్నది చూస్తే కనుక అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ వంటి సంస్థల గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థాపరమైన సమస్యలు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని అనేక దేశాల్లో పారిశ్రామిక వైవిధ్యం కొరవడటంతోనే కొత్త ఉద్యోగాల కల్పన అన్నది బాగా తగ్గిపోయింది అని చెబుతున్నారు. ఇక పలు దేశాల్లో నైపుణ్యాల కొరత వల్ల నిరుద్యోగం ఉంది. ఇప్పటికీ సంప్రదాయ రంగాలపైనే ఆధారపడటం వంటివి కూడా ఉపాధిని తగ్గించేస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిగా కోలుకోవడం వంటివి కూడా అధిక నిరుద్యోగానికి దారితీస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికి అయితే ఎస్వాటిని, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరిందని అంటున్నారు. భవిష్యత్తులో భారత్ లాంటి దేశాల్లో ఈ ప్రమాదం లేకుండా చూసుకోవాలని అంటున్నారు.