తేనెటీగల కోసం.. పోలీసులు వెతుకుతున్నారు అధ్యక్షా!
దేవాలయాలు, వాటి భద్రత, భక్తుల పరిరక్షణ వంటి అంశాలపై గురు వారం.. మండలిలో వైసీపీ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నలు గుప్పించారు.;
శాసన మండలిలో చిత్రమైన చర్చ జరిగింది. దేవాలయాలు, వాటి భద్రత, భక్తుల పరిరక్షణ వంటి అంశాలపై గురు వారం.. మండలిలో వైసీపీ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నలు గుప్పించారు. దేవాలయాల్లో తొక్కిసలాట జరుగుతున్నా.. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో జరిగిన అంతర్వేది రథం దగ్ధం ఘటనను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, నిందితులను గుర్తించలేదని కూడా బొత్స ఆరోపణలు చేశారు.
అనంతరం.. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ అంశాలపై సమాధానం ఇచ్చారు. అయితే.. అప్పటికే..బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు. అయినప్పటికీ.. మంత్రి ఆనం.. సమాధానం ఇస్తూ.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నాస్తికుడని, ఆయనను టీటీడీ చైర్మన్‌ను చేయడమే పెద్ద తప్పని గత ప్రబుత్వాన్ని విమర్శించారు. అదేసమయంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అలిపిరిలో నేలపై పడిన `విగ్రహం` వివాదంపైనా.. స్పందించారు. ఇది శనైశ్చర విగ్రహమేనని.. విష్ణుమూర్తి విగ్రహం కాదని కూడా.. ఆనం సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి ఇచ్చిన లేఖను కూడా సభలో చదివి వినిపించారు. తొలుత శనై శ్చరుడి విగ్రహాన్ని ప్రారంభించారని.. అయితే.. విగ్రహం ప్రారంభించిన తర్వాత.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి మరణించడంతో దానిని నిలుపుదల చేశారని చెప్పారు. తర్వాత విగ్రహం ప్రారంభించిన శిల్పి కూడా మరణించారని.. దీంతో సగంలోనే విగ్రహం ఆగిపోయిందన్నారు. ఇది ముమ్మాటికీ శనైశ్చర విగ్రహమేనని.. నాస్తికుడైన భూమనకు ఈ విషయం ఎలా చెవికి ఎక్కుతుందని వ్యాఖ్యానించారు.
ఇక, అంతర్వేది రథం దగ్ధం కావడం పట్ల మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటన ను అప్పట్లో జగన్‌కు తాబేదారులైన కొందరు పోలీసులు విచారించారని తెలిపారు. అయితే.. తేనెటీగల కారణంగానే రథం దగ్ధమైనట్టు వారు నివేదిక ఇచ్చారని చెప్పారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి. ''ఇది నిజం అధ్యక్షా. రథానికి వెనుక భాగంలో తేనెతుట్టె ఉందని కొందరు గుర్తించారు. దీంతో ఆ తుట్టెకు నిప్పు పెట్టారు. అది రథానికి వ్యాపించి దగ్ధమైంది. ఇదే గత పోలీసులు నివేదిక ఇచ్చారు. ఆ తేనెటీగల కోసం.. పోలీసులు ఇంకా గాలిస్తున్నారు అధ్యక్షా!'' అని వ్యాఖ్యానించారు. అయితే.. సీఎం చంద్రబాబు ఇటీవల దీనిపై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తేనెటీగలను ప్రజలు ఎప్పుడో తరిమికొట్టారని.. ఆ రథం స్థానంలో వేరే రథాన్ని రూపొందించాలని ఆదేశించారని మంత్రి వివరించారు.