కాంగ్రెస్ బీజేపీ ఆశలన్నీ ఏపీ ఫలితాల మీదనే !

ఏపీలో రెండు జాతీయ పార్టీలు కుదేలు అయిపోయాయి. 2019 ఎన్నికలు వాటి అసలు బలాన్ని లోకానికి చాటి చెప్పాయి.

Update: 2024-05-23 03:55 GMT

ఏపీలో రెండు జాతీయ పార్టీలు కుదేలు అయిపోయాయి. 2019 ఎన్నికలు వాటి అసలు బలాన్ని లోకానికి చాటి చెప్పాయి. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ మిగిలాయి. బీజేపీ సంగతి పక్కన పెడితే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి కంచుకోట అనదగిన రాష్ట్రంలో ఈ దీన స్థితి రావడం అంటే హస్తం పార్టీకి ఎంతటి చెడ్డ రోజులు దాపురించాయో అర్ధం చేసుకోవాల్సిందే.

దేశమంతా ఇందిరాగాంధీని ఓడించి కాంగ్రెస్ ని మట్టి కరిపించినా 1978లో ఏపీలో కాంగ్రెస్ కి పెద్ద పీట వేసి అధికారం అప్పగించిన అరుదైన సందర్భం ఉంది. కాంగ్రెస్ ఎపుడూ ఇంతలా చావ చచ్చిన నేపధ్యం లేదు. తెలంగాణాలో సైతం రెండు ఎన్నికల తరువాత నిటారుగా నిలబడి అధికారాన్ని సొంతం చేసుకుంది.

మరి ఏపీలో ఆ అద్భుతం చూడగలమా అన్నదే కాంగ్రెస్ నేతల ఆవేదన. వారికి ఈసారి ఎన్నికల్లో ఆశ అయితే ఎంతో కొంత ఉంది. నోటా కంటే తక్కువ ఓట్లు రావు అన్నది ఈసారి గట్టి నమ్మకం. అంతే కాదు చాలా చోట్ల తమ ఓటింగ్ శాతం పెరుగుతుంది అన్నది మరో నమ్మకం. కనీసంగా రెండు నుంచి మూడు శాతం ఓట్లు సాధించినా తమకు రేపటి ఆశలు మిగిలి ఉన్నట్లే అన్నది కాంగ్రెస్ లెక్క.

ఇక కాంగ్రెస్ కి అసలైన ఆశ మరోటి ఉంది. అదే వైసీపీ ఏపీలో ఓటమి పాలు కావడం. కాంగ్రెస్ ఓట్ల పునాదుల మీద నిర్మాణం అయిన వైసీపీ ఓటమి పాలు అయితే కనుక ఏక వ్యక్తి సారధ్యంలో నిర్మాణం అయిన ఆ పార్టీ పేకమేడలా కూలుతుందని అందులో ఉన్న వారు తనా మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ లోకి తిరిగి వస్తారు అన్నది కూడా ఖద్దరు పార్టీల మరో అంచనా.

Read more!

అందుకే ఆ పార్టీ 2024 ఎన్నికలను చాలా ఆశగా చూస్తోంది. ఈ రెండూ జరిగితే తనకు తిరుగులేదని తాము మరోసారి ఏపీలో కాళ్ళూనుకున్నట్లే అన్నది కాంగ్రెస్ పెద్దల నమ్మకం. ఇక బీజేపీ విషయం తీసుకుంటే టీడీపీని కొట్టి ఎదగాలని ఆ పార్టీ 2019 ఎన్నికల వేళ ఆశించింది. టీడీపీ ఓడింది కానీ బీజేపీ ఆశలు మాత్రం తీరలేదు.

దాంతో ఈసారి మరో రూట్ లో ప్రయత్నం చేస్తోంది. టీడీపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రుడిగా ఉంటూనే రేపటి రోజున కావాల్సినంతగా రాజకీయ అవకాశాలను వాటంగా తీసుకోవాలని చూడడం. ఆ విధంగా చూస్తే కనుక రేపటి రోజున టీడీపీ కూటమి గెలిచినా ఓడినా కూడా రెండిందాల లాభం పొందాలని బీజేపీ పక్కా ప్లాన్ చేసుకుని పెట్టుకుందని అంటున్నారు. ఉదాహరణకు టీడీపీ కూటమి గెలిస్తే అందులో కీలక పాత్ర పోషించడం ద్వారా తన రాజకీయ విస్తీర్ణాన్ని ప్రభుత్వంలో టు ఏపీలోనూ పెంచుకోవడానికి బీజేపీ చూస్తుంది. ఈ క్రమంలో టీడీపీని గుప్పిట పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు

ఇది 2014 కాదు 2024 అని టీడీపీకి చెప్పడానికి కూడా బీజేపీ వెనకాడదు అని అంటున్నారు. ఈసారి తక్కువలో తక్కువ మూడు మంత్రి పదవులు అయినా తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది అని అంటున్నారు. అలాగే జనసేన తోడు తీసుకుని తమ బలాన్ని ఎక్కువగా చూపించి కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేందుకు కూడా తయారుగా ఉందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ ఓడి అపోజిషన్ లో ఉంటే తమ అధికార బలాన్ని ఉపయోగించి ఆ పార్టీ నుంచి కూడా చేరికలను ప్రోత్సహించి బలోపేతం కావడం కూడా ఒక అజెండాగా పెట్టుకుంటారు అని అంటున్నారు.

4

ఇక టీడీపీ కూటమి ఓడితే ఏమి అవుతుంది అంటే వెంటనే జనసేనను విలీనం చేసుకుంటారని ఆ మీదట టీడీపీ నేతలను వరసగా తమ వైపునకు తిప్పుకుని ఆ పార్టీని ఖాళీ చేసే పనిని ముమ్మరంగా మొదలెడతారని అంటున్నారు. ఇలా ప్లాన్ ఏ ప్లాన్ బీ అని రెండూ పెట్టుకుని ఏపీలో ఎన్నికల తరువాత తమ యాక్షన్ ప్లాన్ ని అమలు చేయడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను పక్కకు నెట్టి ఆ ప్లేస్ లోకి తాము రావాలని చూస్తున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఆశలు ఎంతమేరకు నెరవేరుతాయి అన్నది ఫలితాలే చెబుతాయని అంటున్నారు.

Tags:    

Similar News