కాంగ్రెస్ అంటే అంతేనా....గాంధీ భవన్ లో ఓల్డ్ సీన్స్ రిపీట్ !
కాంగ్రెస్ లో గతంలో చాలా సన్నివేశాలు జరుగుతూ ఉండేవి. కాంగ్రెస్ నేతలు వర్గ పోరుతో బాహా బాహీకి దిగడం అన్నది కూడా గతంలో ఎక్కువగా కనిపించేది.
కాంగ్రెస్ లో గతంలో చాలా సన్నివేశాలు జరుగుతూ ఉండేవి. కాంగ్రెస్ నేతలు వర్గ పోరుతో బాహా బాహీకి దిగడం అన్నది కూడా గతంలో ఎక్కువగా కనిపించేది. అయితే ఇపుడు మారిన పరిస్థితులు అంతా చూస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ అంతా ఒక్క త్రాటి మీదకు వచ్చినట్లుగా ఉంది. పెద్దగా మీడియా ముందుకు వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే సీన్ అయితే లేదు. అంతే కాదు అంతా కలసికట్టుగా ఉంటున్నారు. అలాంటి కాంగ్రెస్ లో మళ్లీ ఓల్డ్ ట్రెండ్ రిపీట్ అయినట్లుగా కనిపిస్తోంది. అది కూడా గాంధీ భవన్ వేదికగా చోటు చేసున్న బాహాబాహీ సీన్స్ చూసిన వారికి ఆ కల్చర్ కంటిన్యూ అవుతోందా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి.
ప్రోటోకాల్ విషయంలోనే :
చిత్రమేంటి అంటే మంత్రి అజారుద్దీన్ ఉండగానే ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం. అది కాస్తా తోపులాటకు దారి తీయడంతో ఫిరోజ్ ఖాన్ అనే నాయకుడు ఏకంగా కింద పడిపోయారు. ఆయనకూ కార్వాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఉస్మాన్ అల్ హజ్రీకి మధ్య జరిగిన ఈ ఘర్షణ చిన్న సైజు ఫైటింగ్ సీన్ నే తలపించింది అని అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలు అంతా అక్కడే ఉండి ఘర్షణను ఆపాలని చూసినా కూడా ఆగలేదు సరికదా అరుపులు కేకలు ఇలా అతి పెద్ద సీన్ నే క్రియేట్ చేశారు. ఇంతకీ ప్రోటోకాల్ విషయంలో ఈ పేచీ వచ్చింది అని అంటున్నారు. మంత్రి అజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలి అన్న దాని మీదనే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ ఏర్పడింది అని చెబుతున్నారు.
మా కుటుంబం అన్న ఫిరోజ్ ఖాన్ :
అయితే ఈ గొడవ తరువాత మీడియాతో మాట్లాడిన ఫిరోజ్ ఖాన్ అయితే అంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాం, జస్ట్ మిస్ అండర్ స్టాండింగ్ మాత్రమే అని చెప్పారు. ఇక ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వాడని ఫిరోజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇదంతా కుర్చీ విషయంలో జరిగిన చిన్న మిస్ అండర్ స్టాండింగ్ మాత్రమే అన్నారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకుంటారని అక్కడే ఇబ్బంది వచ్చిందని చెప్పారు. కార్వాన్ నుంచి పోటీ చేసిన ఉస్మాన్ తనకు పెద్దన్నలాంటివాడని అంటే తనకు గౌరవం అని ఫిరోజ్ ఖాన్ చెప్పారు. ఈ ఘటన తరువాత ఇద్దరం కలసిపోయామని హగ్ చేసుకున్నామని కూడా చెప్పారు. ఇది తమ కుటుంబ విషయమని కాంగ్రెస్ లో అంతా ఒక కుటుంబమని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో మంత్రి అజారుద్ధీన్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవడమే కొసమెరుపు. మంత్రి పక్కన ఎవరికి చోటు అన్నది తేలకముందే మంత్రి గారే వెళ్ళిపోయారు అన్న మాట.