వైవీ పీఏ ఉక్కిరిబిక్కిరి.. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

కోర్టు ఆదేశాలతో నిందితుడు చిన్న అప్పన్నను సోమవారం సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు విచారించేందుకు నెల్లూరు నుంచి తిరుపతికి తీసుకువచ్చారు.;

Update: 2025-11-17 13:19 GMT

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై నమోదైన కేసులో చిన్న అప్పన్న ఏ24గా ఉన్నాడు. గత నెలలో అతడిని సీఐడీ అరెస్టు చేయగా, ప్రస్తుతం నెల్లూరు సెంటర్ జైలులో ఉన్నాడు. చిన్న అప్పన్న బ్యాంకు అకౌంట్లలో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్ అధికారులు.. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చింది? ఎందుకు ఇచ్చిందనే విషయాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో కోర్టులో కస్టడీ పిటిషన్ వేయగా, ఐదు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.

కోర్టు ఆదేశాలతో నిందితుడు చిన్న అప్పన్నను సోమవారం సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు విచారించేందుకు నెల్లూరు నుంచి తిరుపతికి తీసుకువచ్చారు. వాస్తవానికి చిన్న అప్పన్నను కస్టడీకి తీసుకోడానికి ముందే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించాలని సిట్ పోలీసులు భావించారు. ఇందుకోసం ఆయన నోటీసులిచ్చారు. వైవీ హయాంలోనే కొన్ని నిబంధనలు సడలించి భోలేబాబా డెయిరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారని, ఆ సంస్థ నాశిరకం నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించినా కూడా చర్యలు తీసుకోలేదని, వెనక్కి తిప్పి పంపిన నెయ్యి ట్యాంకర్లనే తిరిగి టీటీడీకి చేర్చారని సిట్ ఆరోపిస్తోంది.

దీనిపై వివరణ తీసుకునే ఉద్దేశంతో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన అనారోగ్య కారణాల రీత్యా విచారణకు హాజరుకాలేకపోయారని చెబుతున్నారు. దీంతో ఈ నెల 19 లేదా 20న హైదరాబాద్ లోని వైవీ ఇంటికి వెళ్లి విచారించాలని సిట్ నిర్ణయించింది. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏని అరెస్టు చేయడంతో ఆయన విచారణ టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నారు. చిన్న అప్పన్న బ్యాంకు అకౌంట్లలో కోట్ల కొద్ది డబ్బు లావాదేవీలు జరగడాన్ని సిట్ అనుమానిస్తోంది. ఈ విషయమై వైవీని కూడా ప్రశ్నిస్తారా? అనే చర్చ జరుగుతోంది.

వైవీని ప్రశ్నించడానికి ముందు ఆయన పీఏని కస్టడీలోకి తీసుకోవడంతో సిట్ ఒత్తిడి పెంచినట్లైందని అంటున్నారు. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అరెస్టు చేసింది. దాదాపు నెయ్యి సరఫరా చేసిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలింది సూత్రధారులే అని అధికారపార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో అప్పటి పాలకవర్గం, పాలకవర్గ సభ్యులకు సన్నిహితంగా మెలిగిన వారిపై సిట్ ఫోకస్ చేయడం ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News