జనాభా సంక్షోభం : మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన చైనా.. ప్రస్తుతం ఊహించని జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.;

Update: 2025-07-05 05:35 GMT

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన చైనా.. ప్రస్తుతం ఊహించని జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాభా విస్ఫోటకాన్ని నియంత్రించేందుకు దశాబ్దాల క్రితం అమలు చేసిన "వన్ చైల్డ్ పాలసీ" ఇప్పుడు చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విధానం వల్ల వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, యువత తగ్గిపోవడం, పనిచేసే వయసున్న ప్రజల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

చైనాలో గత కొన్నేళ్లుగా పెళ్లి చేసుకునే యువత సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉద్యోగాల కొరత, పెళ్లి వ్యవస్థ పట్ల నిరాసక్తత, ఆధునిక జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటివి యువతను వివాహానికి దూరం చేస్తున్నాయి. దీని ఫలితంగా జననాల రేటు ఆందోళనకరంగా పడిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, 2024 జనవరి 1 తర్వాత పుట్టే శిశువుల సంఖ్యను పెంచేందుకు చైనా ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.

- పిల్లల్ని కనే వారికి భారీ డబ్బు!

జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు చైనా సరికొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రతి పుట్టిన శిశువుకు మూడేళ్ల పాటు సంవత్సరానికి 3,600 యువాన్లు (దాదాపు ₹43,000) అందించనున్నట్లు ప్రకటించింది. మంగోలియా ప్రాంతంలో అయితే రెండవ బిడ్డకు ₹6 లక్షల వరకు .. మూడవ బిడ్డకు ఏకంగా ₹12 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతీయ ప్రభుత్వాలు గృహనిర్మాణ సబ్సిడీలను కూడా అందజేస్తున్నాయి.

- ఈ స్థితికి కారణం ఏమిటి?

గత దశాబ్దాలుగా చైనాలో అమలు చేసిన కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాలు, యువతలో పెరుగుతున్న అనిశ్చితి, అధిక నిరుద్యోగం, ఆర్థిక భయాలు.. ఇవన్నీ కలిసి జాతీయ స్థాయిలో జననాల రేటును గణనీయంగా తగ్గించాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 80 కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు.

- వృద్ధుల పెరుగుదల.. యువత తగ్గుదల ప్రభావం

జననాల తగ్గుదలతో పాటు వృద్ధుల సంఖ్య అధికమవుతోంది. అదే సమయంలో పనిచేసే వయసు గల జనాభా తగ్గిపోతోంది. ఇది దేశంలోని వ్యవసాయ ఉత్పత్తి, తయారీ పరిశ్రమలు, సేవా రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. శ్రామిక శక్తి కొరత వల్ల ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.

-కొత్త పథకాలు ఉపయోగపడతాయా?

ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఈ నగదు ప్రోత్సాహకాలు, గృహ సబ్సిడీలు యువతను పెళ్లి చేసుకొని పిల్లలు కనడానికి ఎంతవరకు ప్రోత్సహిస్తాయో కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే, ఒక బిడ్డను పెంచడానికి అయ్యే ఖర్చులు, జీవన నాణ్యతపై యువత ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ విధానాలపై ప్రభావం చూపవచ్చు. కేవలం నగదు ప్రోత్సాహకాలతో పాటు, ఉద్యోగ భద్రత, మెరుగైన సామాజిక సేవలు, కుటుంబ వ్యవస్థ పట్ల నమ్మకం పెరిగినప్పుడే జనాభా వృద్ధికి సమగ్ర మార్గం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News