మీరు రష్యాతో వాణిజ్యం చేయొచ్చు.. మాకెందుకు నిషేధం?"
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సందర్భంగా, చైనా అమెరికాను తీవ్రంగా విమర్శించింది.;
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సందర్భంగా, చైనా అమెరికాను తీవ్రంగా విమర్శించింది. రష్యాతో వాణిజ్యంపై అమెరికా ద్వంద్వ ధోరణిని చైనా ప్రశ్నించింది.
చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ "రష్యాతో వాణిజ్యం చేయకూడదని మాకు ఎందుకు చెబుతున్నారు? వాస్తవానికి అమెరికానే ఇప్పటికీ రష్యాతో వ్యాపారం చేస్తోంది. మీరైతే చేసుకోవచ్చు, మేమెందుకు కాదు?" అని అమెరికాను నిలదీశారు.
చైనా వాదనలోని ముఖ్యాంశాలు
రష్యాకు ఎలాంటి ఆయుధాలను అందించలేదని చైనా స్పష్టం చేసింది. రష్యా, ఉక్రెయిన్ రెండింటితోనూ సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇవి అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉన్నాయని తెలిపింది. అమెరికా తన వాణిజ్య ప్రయోజనాల కోసం ఇతర దేశాలను బలిపశువులుగా చేయవద్దని హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు కాల్పుల విరమణ, చర్చలపై దృష్టి పెట్టాలని, ఆరోపణలతో ఇతరులను ఒత్తిడిలోకి నెట్టడం సరికాదని అభిప్రాయపడింది.
భారత్, చైనాపై అమెరికా ఒత్తిడి
రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌పై 25% దిగుమతి సుంకాలు, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకుంది. వీటిని కేవలం వాణిజ్యపరమైనవిగా కాకుండా రాజకీయపరమైన చర్యలుగా చైనా అభివర్ణించింది.
చైనా అంతర్జాతీయ చట్టాలకు లోబడి తన వ్యాపారం జరుగుతోందని స్పష్టం చేసింది. అమెరికా తన ప్రయోజనాల కోసం నిబంధనలు మార్చుకుంటూ ఇతరులపై ఒత్తిడి తేవడం సరికాదని బీజింగ్ తేల్చి చెప్పింది. ఉక్రెయిన్‌లో శాంతి కోసం మాటల యుద్ధం కాకుండా, సమన్వయం అవసరమని చైనా అభిప్రాయపడింది.