వైసీపీ నేత చెవిరెడ్డికి గుండె పోటు.. తీరా ఆసుపత్రికి వెళ్లాక?!
వైసీపీ కీలక నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో అరెస్టయి న విషయం తెలిసిందే.;
వైసీపీ కీలక నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో అరెస్టయి న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లిపోతు న్న సమయంలో అక్కడి విమానాశ్రయంలో చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆయనను కస్టడీలోకి తీసుకుని లిక్కర్ స్కాంలోని కీలక విషయాలను రాబట్టాలని పోలీసులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వారు పిటిషన్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఏసీబీ కోర్టులో కూడా దీనిని దాఖలు చేశారు.
అయితే.. ఇంతలోనే చెవిరెడ్డి కథ యూటర్న్ తీసుకుంది. జైల్లో ఉన్న చెవిరెడ్డి అనూహ్యంగా శనివారంమధ్యాహ్నం.. తనకు గుండెపోటు వస్తోందని.. గుండెల్లో మంట, నొప్పిగా ఉందని జైలు అధికారులకు తెలిపారు. దీంతో ఆదరా బాదరాగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ వెంటనే తొలుత విజయవాడ జైలు డాక్టర్లను పిలిచి చెక్ చేయించారు. కానీ.. వారు గుండెపోటు సంకేతాలు ఏవీ లేదని తెలిపారు. అయినా.. తనను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెవిరెడ్డి పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ కూడా డాక్టర్లు అన్ని రూపాల్లోనూ పరీక్షించి.. ఇది `గ్యాస్` నొప్పి తప్ప.. గుండెనొప్పి కాదని పేర్కొన్నట్టు తెలిసింది. అయినా.. తనకు గుండెల్లో పోటుగా ఉందని.. నొప్పి వస్తోందని చెవిరెడ్డి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయనను శనివారం రాత్రి వరకు ఆసుపత్రిలోనే ఉంచారు. అయితే.. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. కస్టడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు చెవిరెడ్డి ఇలా చెబుతున్నారన్నది వారి వాదన. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. విచారణను మాత్రం ఎదుర్కోక తప్పదని పోలీసులు చెబుతున్నారు.