సింగపూర్ రెండో నివాసంగా అమరావతి
ఏపీ అన్ని విధాలుగా నంబర్ వన్ గా ఉందని బాబు చెప్పారు. భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫుల్ బిజీగా సాగింది. ఆయన అనేక మంది పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా కలిశారు. కీలక సదస్సులలో పాల్గొన్నారు. ఆ దేశ అధినేతలను కలిశారు. ఏపీ గురించి ప్రతీ సందర్భంలోనూ ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. ఇక సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ రెండవ నివాసంగా చేసుకోవాలని అక్కడి పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీదే పేటెంట్ అని బాబు ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు ఇండియాకే ఎకనమిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని బాబు అన్నారు.
ఏపీ నంబర్ వన్ గా :
ఏపీ అన్ని విధాలుగా నంబర్ వన్ గా ఉందని బాబు చెప్పారు. భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ఆయన చెప్పారు. పెట్టుబడులకు ఏపీ ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. సింగపూర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు మంచి సంబంధాలున్నాయని అన్నారు. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నామని బాబు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్ షిప్‌నే నిర్మించామని అన్నారు. ఇక విభజన ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని అన్నారు. బ్లూ, గ్రీన్ రాజధానిగా ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించిందని బాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి తదితర అంశాలలో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు :
అదే విధంగా ఏపీలో పరిశ్రమలకు భూమి కేటాయింపు, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్‌కు అనతికాలంలోనే అన్ని అనుమతులు వేగంగా ఇచ్చాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుందని ఆయన తెలిపారు. . గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా హబ్ కూడా ఏర్పాటు అవుతోందని, ఆ సంస్థకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించామని అన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు ఆపరేషనల్ స్కిల్ యూనివర్సిటినీ కూడా ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని బాబు చెప్పారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగిందని, దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటున్నాయని అన్నారు.
గ్లోబల్ నగరాలకు ఏపీ కనెక్టివిటీ :
అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం తెచ్చామని బాబు చెప్పారు. ఏపీకి ఉన్న వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతంలో 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టులను దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశీ పోర్టులకు కనెక్ట్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని బాబు వివరించారు. భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని ఆయన చెప్పారు. లాజిస్టిక్స్, అగ్రికల్చర్, సివిల్ ఏవియేషన్, ఎనర్జీ లాంటి వివిధ అంశాల్లో ఫంక్షనల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని కూడా వెల్లడించారు.