నేరుగా ప్రజలకే చెబుతా....బాబు కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబుది దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం. అందులో పాలనానుభవం ఆయనకు రెండు దశాబ్దాల పై మాటగా ఉంది.;

Update: 2026-03-31 18:16 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుది దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం. అందులో పాలనానుభవం ఆయనకు రెండు దశాబ్దాల పై మాటగా ఉంది. మంత్రిగా ముఖ్యమంత్రిగా బాబు పాలనలో తనదైన మార్క్ ని చూపిస్తూ వచ్చారు. ఇక ఉమ్మడి ఏపీకి కేవలం 45 ఏళ్ల వయసులో సీఎం అయిన బాబు నాడు పాలనను గాడిన పెట్టారు. ఒక విధంగా చెప్పాలీ అంటే పెద్దగా సాంకేతికత లేని రోజులలో పరుగులు పెట్టించారు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆ రోజుల్లోనే చూపించారు. ఒక విధంగా చెప్పాలి అంటే అప్పట్లో ప్రభుత్వ ఆఫీసులలో చాలా ఈజీగా ప్రజల పనులు అయ్యేవి. అంతలా క్రమశిక్షణను పాదుకొల్పారు చంద్రబాబు.

ప్రజల సమక్షంలోనే :

ఇదిలా ఉంటే తాజాగా ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉండకూడని స్పష్టం చేశారు. అంతే కాదు అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని గట్టిగా చెప్పేశారు. ఇకపై ఉన్నతస్థాయి ఉద్యోగులు మొదలుకుని క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని బాబు ప్రకటించారు. అంతే కాదు పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రొత్సహిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో . పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని, ఇక అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని బాబు తేల్చి చెప్పారు.

జిల్లాల పర్యటనలతో :

తాను ఇకపై జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్బంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పడం విశేల్షం. ఏ అధికారి పనిచేయకపోయినా వారి గురించి నేరుగా ప్రజలకే చెబుతానని బాబు చెప్పడం గమనార్హం. తాను పరిపాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతోందని ఆయన చెబుతూ వాటిని పటిష్టంగా అమలు చేయాల్సింది అధికార యంత్రాంగమే అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.

సోషల్ మీడియాలోనూ :

జిల్లాల్లోని పరిపాలనా యంత్రాంగం కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని బాబు సూచించారు. అంతే కాకుండా ఎక్కడైనా శాఖాపరంగా తప్పుడు ప్రచారాన్ని ఎవరైనా చేస్తే కనుక వాటిని బలంగా తిప్పికొట్టడమే కాకుండా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కోరారు ఈ మేరకు అధికార యంత్రాంగం సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్సర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అంతే కాదు తాను ఇకపై నేను జిల్లాల పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో పరిస్థితిని బట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తానని బాబు చెప్పారు. ఆ సమయంలో శాఖల పనితీరును అధికారులు, ఉద్యోగుల పనితీరును కూడా క్షేత్ర స్థాయిలోనే విశ్లేషిస్తానని చెప్పారు. ఆ తరువాత ప్రజలకు వాస్తవాలను స్వయంగా తానే వివరిస్తానని బాబు చెప్పుకొచ్చారు.

శిక్షణా తరగతులతో :

ఇక ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. . ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేలా వారికి అవసరమైన శిక్షణ ఇస్తామని అన్నారు. అమరావతిలో రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రాన్ని అలాగే వివిధ ప్రాంతాల్లో జోనల్ వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని బాబు అధికారులకు సూచించారు. ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనే విషయం ప్రజలకు అర్థం కావాలని ఆయన కోరారు. అధికారులు ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏమైనా సాంకేతిక పరిపాలనా పరమైన ఇబ్బందులుంటే వాటిని తొలగించాలని అన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సేవలో ప్రజా కోణం అనేది మరిచిపోకూడదని అధికారులకు హితవు చెప్పారు.

Tags:    

Similar News