బ్రాండింగ్‌లో బాబు-పవన్ తర్వాతే ఎవరైనా..! ఇలా ఎందుకు అంటున్నారంటే..?

రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం, ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే.. గెలిచిన తర్వాత అదే సమన్వయాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని నడపడం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడం మరో ఎత్తు.

Update: 2026-06-17 07:14 GMT

రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం, ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే.. గెలిచిన తర్వాత అదే సమన్వయాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని నడపడం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడం మరో ఎత్తు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య కనిపిస్తున్న బంధం కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పడిన బలమైన పునాదిగా చెప్పుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టే ఆ ఇద్దరు నేతలు నడుచుకుంటున్నారని జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి కట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఇద్దరు నేతలు ‘ఒకే మాట.. ఒకే బాట.. ఒకటే బాణం’ అన్నట్లుగా సాగుతున్నారని అంటున్నారు. వీరి మధ్య ఉన్న ఈ అద్భుతమైన బాండింగ్.. ఇప్పుడు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ‘బ్రాండింగ్’ తీసుకువస్తోందని అంటున్నారు.

అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్లుగా బాబు, పవన్

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకే విధమైన ఆలోచన ధోరణితో నడుచుకుంటున్నారనే అభిప్రాయానికి తాజా ఉదాహరణ అరకు కాఫీ అంటున్నారు. ఉత్తరాంధ్ర మన్యం ప్రాంత గిరిజన రైతులు పండించే అరకు కాఫీ ఒకప్పుడు సరైన గుర్తింపు లేని ఉత్పత్తిగా మిగిలిపోయేది. కానీ, అరకు కాఫీ విశిష్టతను గతంలోనే గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, దానికి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఏపీకి వచ్చే విదేశీ ప్రతినిధులకు, ప్రముఖులకు అరకు కాఫీని బహుమతిగా ఇస్తూ ఆయనే దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు.

ఇప్పుడు సరిగ్గా అదే బాటలో నడుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రెండురోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్.. తనతో పాటు ప్రత్యేకంగా అరకు కాఫీ పొడి ప్యాకెట్లను తీసుకెళ్లారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు, వారిని సత్కరించి అరకు కాఫీని గిఫ్ట్‌గా అందించారు. పవన్ చేతిలో అరకు కాఫీని చూడగానే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సంభ్రమాశ్చర్యాలకు గురికావడం విశేషం. గతంలో చంద్రబాబు చేసిన బ్రాండింగ్‌ను, ఇప్పుడు పవన్ కల్యాణ్ అంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్తుండడం వీరిద్దరి మధ్య ఉన్న ఆలోచనా విధానాల సమన్వయానికి అద్దం పడుతోందని అంటున్నారు.

పొత్తు రాజకీయాల్లో సరికొత్త ఆదర్శం

సాధారణంగా కూటమి ప్రభుత్వాల్లో భేదాభిప్రాయాలు, ఆధిపత్య పోరాటాలు ఎక్కడైనా సహజంగా కనిపిస్తుంటాయి. కానీ, ఏపీలో చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ లక్ష్యం కలిసి ఒక అద్భుతమైన సమన్వయాన్ని సృష్టించాయని అంటున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఏ వేదికపై మాట్లాడినా ఇద్దరి స్వరం ఒక్కటిగానే వినిపిస్తోందని చెబుతున్నారు. ఒకరు రాష్ట్రానికి సీనియర్ గైడ్‌గా దిశా నిర్దేశం చేస్తుంటే.. మరొకరు అంతే బాధ్యతగల నాయకుడిగా భారాన్ని భుజాన వేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరస్పర గౌరవం, అవగాహన కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా పరిపాలనలోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తోందని చెబుతున్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రాజమార్గం

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలన్నా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ లభించాలన్నా.. పాలకులపై ప్రపంచానికి నమ్మకం కలగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ ఆలోచనతోనే తమ మధ్య చక్కని సమన్వయం పాటిస్తూ దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక గిరిజన రైతుల సంక్షేమం కోసం అరకు కాఫీని ప్రమోట్ చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వ్యూహాన్ని ఇద్దరూ సమానంగా అమలు చేయడం దీనికి ఒక నిదర్శనమని అంటున్నారు.

Tags:    

Similar News