ఉత్సాహంగా పవన్.. ముంబైలో ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు పరామర్శ

ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం పరామర్శించారు

Update: 2026-07-12 13:12 GMT

ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం పరామర్శించారు. పవన్ కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. పవన్ రెండు భుజాలలోని రొటేటర్ కఫ్ తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు గతంలోనే నిర్ధారించారు. శనివారం కుడి భుజానికి ఆపరేషన్ పూర్తవగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మిత్రుడిని పరామర్శించేందుకు ప్రత్యేకంగా ముంబై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు.

సాధారణంగా ఆదివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ పయనమవుతారు. ఒక రోజు కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి సోమవారం అమరావతికి వస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఆదివారం హైదరాబాద్ వెళుతూనే ఉన్నారు. కానీ, ఈ ఆదివారం కుటుంబ సభ్యులతో గడపడానికి కాకుండా పవన్ కల్యాణ్ ను పరామర్శించడానికి వాడుకున్నారు. ఇది వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ అనుబంధాన్ని పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆరోగ్యంపై ఆరా:

ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నప్పటికీ, పవన్ కల్యాణ్ అధికారిక విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం మనుగడ కోసం విశేషంగా కృషిచేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి పవన్ కు అమిత ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు.

పవన్ పట్ల చంద్రబాబు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ బంధమే కాకుండా, వ్యక్తిగత ఆత్మీయతను కూడా చాటి చెబుతోందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై జనసేన, టీడీపీ శ్రేణులు సానుకూలంగా స్పందిస్తూ, నాయకుల మధ్య ఉన్న ఈ సమన్వయం రాష్ట్రానికి శుభసూచకమని పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News