నన్ను రేప్ చేస్తామని.. చంపేస్తామని బెదిరించారు.. శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ ఆవేదన
పాడ్‌కాస్ట్‌లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక క్షోభను పంచుకున్నారు.. "నా బాడీ గురించి, నా క్యారెక్టర్ గురించి, నా లుక్స్ గురించి అత్యంత అసభ్యకరంగా ట్రోల్ చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. తనకు ఎదురైన భయంకరమైన ఆన్‌లైన్ ట్రోలింగ్, సైబర్ వేధింపుల గురించి గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కేవలం సోషల్ మీడియా వేదికగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తాను ఎదుర్కొన్న నరకాన్ని వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
సరదా రీల్.. ప్రాణాల మీదకు తెచ్చిన వివాదం
ఈ వివాదం 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ప్రారంభమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిబంధనల ప్రకారం ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో శ్రేష్ఠ తన స్నేహితులతో కలిసి సరదాగా ఒక రీల్ రూపొందించారు. అందులో "కోల్ కతా కు నేను ఒక పాయింట్ గిఫ్ట్‌గా ఇచ్చాను" అనే కాన్సెప్ట్‌తో పోస్ట్ చేశారు.
అయితే ఈ సున్నితమైన హాస్యాన్ని కొందరు క్రికెట్ అభిమానులు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆమెపై ఒక్కసారిగా ఆన్‌లైన్ దాడికి దిగారు. మొదట్లో సాధారణ విమర్శలతో మొదలైన ఈ వ్యవహారం, అతి త్వరలోనే హద్దులు దాటి భయంకరమైన రూపం దాల్చింది.
హద్దులు దాటిన సైబర్ వేధింపులు
పాడ్‌కాస్ట్‌లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక క్షోభను పంచుకున్నారు.. "నా బాడీ గురించి, నా క్యారెక్టర్ గురించి, నా లుక్స్ గురించి అత్యంత అసభ్యకరంగా ట్రోల్ చేశారు. కేవలం కామెంట్లు చేయడమే కాదు.. నన్ను చంపేస్తామని, రే*ప్ చేస్తామని కూడా బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా నేను దుబాయ్‌లో పనిచేస్తున్న చోటుకు కూడా కొందరు వచ్చి నన్ను వేధించారు. ఆ సమయంలో నేను తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాను." అని వాపోయింది.
శ్రేష్ఠ షేర్ చేసిన ఈ చేదు అనుభవాల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. సెలబ్రిటీల కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ ఇలాంటి దారుణమైన బెదిరింపులకు దిగడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యతారాహిత్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఈ ఘటన మరోసారి సైబర్ బుల్లీయింగ్ , మహిళలపై ఆన్‌లైన్ వేధింపుల అంశాన్ని తీవ్రంగా చర్చకు తెచ్చింది. ఆటను ఆటలా చూడకుండా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై, వారి కుటుంబ సభ్యులపై ఇలాంటి దాడులకు దిగడం పూర్తిగా క్షమించరాని నేరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, వ్యక్తిగత విమర్శలు, ప్రాణహాని, లైంగిక దాడి బెదిరింపులకు పాల్పడే ఉన్మాదులపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. శ్రేష్ఠకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.