బైక్ పార్కింగ్ పొరపాటు.. పెద్ద విషాదం : సీపీ సజ్జన్నార్ ఎమోషనల్ పోస్ట్

కానీ, వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారికి తెలియకుండానే వారు చేసే చిన్న పొరపాట్లు క్షణాల్లో ఊహించని ప్రమాదాలుగా మారుతున్నాయి.

Update: 2026-07-12 08:57 GMT

చిన్నపాటి అజాగ్రత్త జీవితకాలపు విషాదానికి దారితీస్తుందనే చాటిచెప్పే సంఘటన ఇది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై పిల్లలు కూర్చుని ఉన్నప్పుడు తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సివుంటుంది. లేనిపక్షంలో పిల్లలను చేజేతులా కోల్పోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్ లో ద్విచక్రవాహనం ఇంజిన్ ఆఫ్ చేయకుండా ఓ తండ్రి వదిలేయడం, బండి కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా ఎక్సలేటర్ ఇవ్వడంతో ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి చిన్న పొరపాట్లు జీవితకాలం వెంటాడే శాపాలు అంటూ ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు.

‘‘సాధారణంగా చిన్నారులకు బైక్ ఎక్కడం ఒక సరదా, యాక్సిలరేటర్ తిప్పడం ఒక సంబురం. కానీ, వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారికి తెలియకుండానే వారు చేసే చిన్న పొరపాట్లు క్షణాల్లో ఊహించని ప్రమాదాలుగా మారుతున్నాయి. పిల్లలు యాక్సిలరేటర్ తిప్పగానే బైక్ ఒక్కసారిగా దూసుకుపోయి, వారు వాహనంతో సహా కింద పడిపోవడం లేదా ఇతర వాహనాలను ఢీకొనడం వంటి దృశ్యాలు భీతావహంగా ఉంటున్నాయి. కళ్లముందే నిమిషం వ్యవధిలో జరిగిపోయే ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సింది తల్లిదండ్రులే’’ అని సీపీ సజ్జనార్ తన పోస్టులో సూచించారు.

ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి తల్లిదండ్రులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. వాహనం ఎక్కడ నిలిపివేసినా, వెంటనే ఇంజిన్ ఆపి, కీ (తాళం) తీసేయడాన్ని ఒక ప్రాథమిక నియమంగా మార్చుకోవాలని చెప్పారు. ఇంజిన్ ఆన్‌లో ఉన్న టూ-వీలర్‌పై చిన్నారులను ఏ పరిస్థితిలోనూ ఒంటరిగా కూర్చోబెట్టకూడదని, ముఖ్యంగా పిల్లల చేతులు యాక్సిలరేటర్‌కు అందేలా వాహనాల ముందు భాగంలో నిలబెట్టడం అత్యంత ప్రమాదకరమని తల్లిదండ్రులు గ్రహించాలని ఈ సంఘటన తెలియజేస్తోంది. వాహనం మీద పిల్లలు ఉన్నప్పుడు వారిపై నిరంతరం నిఘా ఉంచడం చాలా అవసరం అంటున్నారు.

చిన్న నిర్లక్ష్యంతో వారి సంబురాన్ని విషాదంగా మార్చుకోకూడదని, సురక్షిత ప్రయాణం బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని ఈ ఘటన నిరూపిస్తోంది. మనం పాటించే చిన్న జాగ్రత్తలే మన చిన్నారుల ప్రాణాలను కాపాడే కవచాలుగా మారుతాయని సీపీ సజ్జన్నార్ సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను, భద్రతా ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలని, కనీసం మన కళ్లముందే పిల్లలు ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ వీడియో మనకు హెచ్చరికను జారీ చేస్తోంది. ఇక సీపీ సజ్జనార్ షేర్ చేసిన వీడియో కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ ఒక భద్రతా పాఠంగా తీసుకోవాలని అంటున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేలా జాగ్రత్త పడటమే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే గొప్ప రక్షణగా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News