సీఎం అయినా పక్క రాష్ట్ర పార్టీ సేవకుడ్ని మరవని చంద్రబాబు
జెండా మోసిన కార్యకర్తను గౌరవిస్తామని.. వారిని కంటికి రెప్పలా కాపాడుతామంటూ చెప్పే అధినేతలు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే కనిపిస్తారు.;
జెండా మోసిన కార్యకర్తను గౌరవిస్తామని.. వారిని కంటికి రెప్పలా కాపాడుతామంటూ చెప్పే అధినేతలు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే కనిపిస్తారు. కానీ.. మాటల్లో కనిపించే కమిట్ మెంట్ చేతల్లో పెద్దగా కనిపించదు. అందుకు భిన్నంగా కొందరు అధినేతలు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను పాలిస్తున్న రాష్ట్రానికి చెందిన నేత మరణిస్తే.. వారి కుటుంబాన్ని కలవటం.. పరామర్శించటం లాంటివి కామన్. కానీ.. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారి.. పార్టీ ఫ్యూచర్ లేని రాష్ట్రానికి చెందిన ఒక నేత.. పార్టీకి అత్యంత విధేయుడైన ఒక నేత మరణించిన వేళ.. ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్లటం.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాదాపు అరగంటకు పైనే సమయాన్ని వారి కుటుంబానికి కేటాయించటం చూసినప్పుడు.. చంద్రబాబు చెప్పే మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు.. ఆయన కుటుంబానికి అత్యంత విధేయుడు.. నమ్మకస్తుడు.. కరడుకట్టిన తెలుగుదేశం అభిమాని లాంటి మాటలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పిన్నమనేని సాయిబాబాకు వర్తిస్తాయి. పార్టీకి ఆయన చేసిన సేవలు ఎంతన్న విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవాలంటే.. ఆయన అంత్యక్రియలకు ఎన్టీఆర్ కుమారుడు రామక్రిష్ణ ప్రత్యేకంగా హాజరు కావటమే కాదు.. సాయిబాబా కుటుంబం వెన్నంటే ఉన్నారు.
శారీరకంగా చూస్తే సాయిబాబా దివ్యాంగుడు. అయినప్పటికి మనసుంటే మార్గం ఉంటుందన్నట్లుగా తాను అమితంగా ప్రేమించి.. ఆరాధించే పార్టీ కోసం ఆయన తన జీవితాంతం పని చేశారు. ఆయన మరణించిన సమయంలో చంద్రబాబు ప్రత్యేక దీక్షలో ఉన్న కారణంగా..ఆయన వెళ్లలేదు. వాస్తవానికి సాయిబాబా మరణించిన వార్త బయటకు వచ్చినంతనే చంద్రబాబు ఆయన నివాసానికి వెళతారని భావించారు. కానీ.. అలా జరగకపోవటం పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది. అయితే.. దీక్షలో ఉన్న కారణంగా వెళ్లకూడదన్న సూచనతో ఆయన వెళ్లలేదని సమాచారం.
అయితే.. సాయిబాబా మరణం గురించి సమాచారం తెలిసినంతనే.. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు.. చివరకు ఆదివారం (జనవరి 4) బేగంపేటలోని వారి నివాసానికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికి.. సాయి బాబా ఇంటికి వెళ్లి అరగంటకు పైనే సమయాన్ని కేటాయించిన తీరు చూస్తే.. కార్యకర్తలు.. పార్టీకి అత్యంత విధేయులుగా వ్యవహరించే వారిని తాను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోనన్న విషయాన్ని చేతలతో చంద్రబాబు స్పష్టం చేశారని చెప్పాలి.