విశాఖలో బాబు మకాం...కౌంట్ డౌన్ స్టార్ట్

ఈ పెట్టుబడుల సదస్సుకు వీవీఐపీలు అంతా హాజరవుతున్నారు. ఉప రాష్ట్రప‌తి సీపీ రాధాక్రిష్ణన్, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్, పలువురు కేంద్ర మంత్రులు భాగ‌స్వామ్యం కానున్నారు.;

Update: 2025-11-10 15:30 GMT

విశాఖలో పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధం అయింది. చివరి పనులు కూడా ఈ నెల 12 సాయంత్రంతో పూర్తి అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నెల 14, 15 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు విశాఖ వేదిక అవుతోంది. పెట్టుబడుల సదస్సులు గతంలో విశాఖలో ఎన్నో జరిగాయి కానీ ఈసారి జరిగేది మాత్రం నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా ఉంటుందని చెబుతున్నారు. పెట్టుబడుల సదస్సుని విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసింది. ప్రపంచంలో అనేక దేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి స్వయంగా పెట్టుబడులను అహ్వానించారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అదే విధంగా ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం ప్రఖ్యాత సంస్థలను కంపెనీలకు పెట్టుబడుల సదస్సులో భాగస్వామ్యం చేసేందుకు తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వచ్చారు.

అందంగా విశాఖ :

విశాఖ పెట్టుబడుల సదస్సు కోసం అందంగా ముస్తాబు అయింది. దేశ విదేశాల నుంచి దాదాపుగా మూడు వేల మంది ప్రతినిధులు పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు అని తెలుస్తోంది. దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈసారి అంతా విశాఖ వైపు చూడడం విశేషం. దావోస్ తరహాలో విశాఖలో రెండు రోజుల పాటు జరుగుతున్న పెట్టుబడుల సదస్సు ఒక రికార్డుగా మిగిలిపోవాలని ప్రభుత్వం చూస్తోంది.

పది లక్షల కోట్లు లక్ష్యం :

ఈసారి పెట్టుబడుల సదస్సులో ఏకంగా పది లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక అరుదైన ఘనతగా నిలిచిపోవాలని సర్కార్ తాపత్రయపడుతోంది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటోంది. అంతే కాదు ఏకంగా నాలుగు వందలకు పైగా ఒప్పందాలు సదస్సులో కుదుర్చుకోవాలని రంగం సిద్ధం చేసింది. వందకు పైగా సంస్థల శంకుస్థాప‌న‌ల‌ను ప్రారంభోత్సవాలను నిర్వహించాలని కూడా ప్రణాళికను రూపొందించింది.

వీవీఐపీలు అంతా :

ఈ పెట్టుబడుల సదస్సుకు వీవీఐపీలు అంతా హాజరవుతున్నారు. ఉప రాష్ట్రప‌తి సీపీ రాధాక్రిష్ణన్, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్, పలువురు కేంద్ర మంత్రులు భాగ‌స్వామ్యం కానున్నారు. అంతే కాకుండా భారీ స్థాయిలో ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సదస్సు పెద్ద ఎత్తున సాగుతుండటంతో భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హై లెవెల్ సెక్యూరిటీ విశాఖ మొత్తాన్ని పహరా కాయనుంది. కస్ట‌మ్స్, ఇమ్మిగ్రేష‌న్, పోలీసు విభాగాల అధికారులు భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌ల్లో అప్ర‌మ‌త్తంగా ఉండేలా చూస్తున్నారు.

ముందుగానే బాబు :

ఇక పెట్టుబడుల సదస్సుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ముందుగానే అంటే ఈ నెల 12వ తేదీ రాత్రికి న‌గ‌రానికి చేరుకుంటారు. ఆయన 13వ తేదీన సీఐఐ, రాష్ట్ర స్థాయి అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతారు. అలాగే ప్రాథ‌మిక స్థాయి స‌మావేశాలు నిర్వ‌హిస్తారు. అదే రోజు సాయంత్రం అతిథుల‌తో క‌లిసి గాలా డిన్న‌ర్ లో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు చంద్రబాబు విశాఖలో మకాం చేయనున్నారు.

ఫుల్ అలెర్ట్ గా :

అదే విధంగా విశాఖలో రెండు రోజుల పాటు జ‌రిగే స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌లో భాగంగా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వహించాల‌ని అధికారులు భావిస్తున్నారు. స్పాట్ రిజిస్ట్రేష‌న్ ఉండ‌ద‌ని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారుఇ. అదే విధంగా సదస్సు వేదిక మీద నుంచ శంకుస్థాప‌న‌ల‌కు సంబంధించి ముంద‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఏర్పాటు సైతం పూర్తి స్థాయిలో చేశారు. సదస్సు ప్రాంగణంలో నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా చూసుకోవడంతో పాటు ఇంట‌ర్నెట్ వ‌స‌తి క‌ల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News