చంద్ర‌బాబు కాన్ఫిడెన్స్ కోల్పోతున్న తమ్ముళ్లు.. !

టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నాయకులను నమ్మరు. అన్నీ ఆయనే చూసుకుంటారు. అనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-03 06:30 GMT

టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నాయకులను నమ్మరు. అన్నీ ఆయనే చూసుకుంటారు. అనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఒకప్పుడు చంద్రబాబు పార్టీ బాధ్యతలను కొందరు సీనియర్ నాయకులకు అప్పగించారు. అయితే, వారు చేసిన పనుల కారణంగా 2019లో పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో ఆ తర్వాత చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకుని ఎక్కడికి అక్కడ అన్ని విషయాలు తానే తెలుసుకుని తద్వారా తాను చేయాలనుకున్న పనులను ప్రజల మధ్యకు తీసుకువెళ్లారు. తద్వారా 2024లో పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఊహించిన విధంగా 134 స్థానాల్లో విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత చాలామంది నాయకులు నియోజకవర్గంలో ఆధిప‌త్యం ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో అప్పటివరకు మరోసారి పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించాలని భావించినప్పటికీ చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నిజానికి ఏ పార్టీలో అయినా కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ అభివృద్ధి, ప్రజల్లోకి వెళ్లడం, పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం అంటి విషయాలను నాయకులకు అప్పగించడం అనేది సహజం.

ఈ విషయంలో చంద్రబాబు గతంలో చాలామంది నాయకులను నమ్మారు. కానీ, వారి వల్ల పార్టీ దారుణంగా దెబ్బతిని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. సుపరిపాలన అందిస్తున్నామని కూడా చంద్రబాబు చెబుతున్నారు. ప్రజల్లో కూడా సానుకూలత బాగానే వ్యక్తం అవుతుంది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు మరింతగా పార్టీని విస్తరించేందుకు నాయకులకు అధికారాలు ఇవ్వాలన్నది కొన్నాళ్లుగా పార్టీలో వినిపిస్తున్న మాట. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటికే అనేక రూపాల్లో పరిశీలన చేశారు.

అనేక నివేదికలు తెప్పించుకున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. దీంతో కొంతమంది నాయకులకు పగ్గాలు అప్పగించిన మాట వాస్తవం. కానీ ఎక్కడైతే పార్టీ డెవలప్ అవుతుందని నమ్మి నాయకులకు పగ్గాలు అప్పగించారో అక్కడే పార్టీ దెబ్బతినడం ప్రారంభిస్తోంది, దీంతో మళ్లీ చంద్రబాబు అధికారాలను పూర్తిగా తన దగ్గరే పెట్టుకోవాలని నిర్ణయించినట్లు తాజాగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చారు. ఇటీవల పలు నియోజకవర్గాల‌లో జరిగిన పరిణామాలను చంద్రబాబు నాయకులకు వివరించారు. పార్టీ పరంగా అభివృద్ధి చేయాల్సిన నాయకులే పార్టీని దిగజారే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇప్పటివరకు తాను కొంతమందిని నమ్మి పార్టీ పగ్గాలను అప్పగించాలని అనుకున్నాన‌ని చెప్పారు. కానీ ఈ తరహా పరిస్థితులను తాను జీర్ణించుకోలేకపోతున్నానని కూడా చెప్పడం విశేషం. ఉత్తరాంధ్ర నుంచి కర్నూలు దాకా అనేకమంది నాయకులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పు పట్టారు. ఈ తరహా రాజకీయాలు చేస్తారని ఊహించలేదని, పార్టీని డెవలప్ చేస్తారని అనుకున్నానని కూడా ఆయన చెప్పడం విశేషం. ఏది ఏమైనా చంద్రబాబు విశ్వాసాన్ని నాయకులు చూర‌గొన‌లేకపోతున్నారన్నది వాస్తవం. మరి ఇలాగే ఉంటుందా.. పార్టీలో మార్పులు ఏమైనా జరుగుతాయా.. నాయకులు మారతారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పార్టీ విషయంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు. అలాగని బయటపడలేక ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News