ఆయనకు ప్యాలెస్‌లు.. పేదలకు శ్మశానాలా?: జగన్‌పై చంద్రబాబు ఫైర్
``వ్యవస్థలను ధ్వంసం చేసిన గతవైసీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలలను కూడా భగ్నం చేసింది.;
''వ్యవస్థలను ధ్వంసం చేసిన గతవైసీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలలను కూడా భగ్నం చేసింది. వారికి ఇళ్లను కట్టించి ఇస్తామని చెప్పి.. ఆ ముసుగులో వైసీపీ నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఇది న్యాయమా? అని ప్రజలను అడుగుతున్నా. ప్రజలు ఆలోచన చేయాలి.'' అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లాలోని పుదూరు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అధునాతన వసతులతో కూడి 1.5 లక్షల టిడ్కో ఇళ్లను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించి.. లబ్ధి దారులతో గృహ ప్రవేశాలు చేయించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పేదలకు నకిలీ మద్యాన్ని విక్రయించి..వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వైసీపీప్రభుత్వం.. వారి సొంత ఇంటి కలలను కూడా నాశనం చేసిందని విమర్శించారు. జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో ఏకంగా 815 కోట్ల రూపాయల అప్పు పెట్టారని చెప్పారు. శ్మశానాలు.. ఊరి చివర భూములు కేటాయించి.. పేదలకు అన్యాయం చేశారని.. వాటిని ఎలానూపేదలు తీసుకోరని తెలిసి.. ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ``ఆయనకేమో విల్లాలాంటి విలాసవంతమైన ప్యాలెస్‌కావాలి.పేదలకు మాత్రం శ్మశానంలో స్థలాలు కేటాయించి కట్టుకోమన్నాడు`` అంటూ జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
కూడు-గుడ్డ-గూడు నినాదాన్ని తొలుత అమలు చేసింది.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చింది కూడా టీడీపీనేనని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్.. తర్వాత తాను పేదలకు ఇళ్లను ఇచ్చామన్నారు. పేదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఇచ్చిన వాటికంటే.. మరిన్ని ఎక్కువగా రాష్ట్రంలోనిపలు ప్రాంతాల్లో నిర్మించి ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రతి విషయంలోనూ పేదల కోణంలోనే తాను ఆలోచన చేస్తున్నానని తెలిపారు.
అమరావతి నెంబర్ 1
రాజధాని అమరావతి విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. దీనిని నెంబర్ 1 నగరంగానే కాకుండా.. ప్రత్యేక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. హైదరాబాద్, చెన్నైల కంటే కూడా అమరావతి భిన్నంగా ఉంటుందన్నారు. సుదీర్ఘ లక్ష్యాలను నిర్ణయించుకుని తాను వేసిన ప్రతి అడుగు ప్రజల కోసమేనన్నారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరన్న చంద్రబాబు.. దీనికి సంబంధించిన తీర్మానం కూడా త్వరలోనేచట్టం కానుందని చెప్పారు. ఇక, అప్పుడు మూడు ముక్కలు.. నాలుగు ముక్కలు ఆడేవారికి శాశ్వతంగా బ్రేకులు పడతాయన్నారు.