ఖరీదైన కలలు అవసరమా చంద్రబాబు?
అనుభవం ఉన్నోడు తక్కువ తప్పులు చేస్తుంటారు. తొందరపాటు నిర్ణయాలు ఉండవు. తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడి నిర్ణయాలు తీసుకోవటం కనిపించదు.;
అనుభవం ఉన్నోడు తక్కువ తప్పులు చేస్తుంటారు. తొందరపాటు నిర్ణయాలు ఉండవు. తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడి నిర్ణయాలు తీసుకోవటం కనిపించదు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నేతల తీరుకు.. ఇప్పటికే మూడు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అధినేతకు మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. సిత్రమైన అంశం ఏమంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం.. అధికారంలో ఉన్న ప్రతిసారీ తెలిసిన తప్పులే చేస్తూ ఉంటారు. గత పాలనలో తన ద్వారా జరిగిన తప్పుల్ని అధికారం కోల్పోయిన తర్వాత గుర్తించటం.. తిరిగి అధికారంలోకి వచ్చినంతనే మర్చిపోవటం ఒక అలవాటుగా మారిందని చెప్పాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే..ఖరీదైన కలల గురించి అదే పనిగా చెప్పుకోవటం మంచిది కాదు. ఎందుకంటే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయటమే పెను భారంగా మారిన సమయంలో.. ఆచరణలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అంశాల జోలికి ఎంత తక్కువ వెళితే అంత మంచిది. అందుకు భిన్నంగా చంద్రబాబు మాత్రం.. ఆచరణలో ఎన్నో సమస్యలు ఎదురయ్యే వరాల్ని ఇట్టే ఇచ్చేస్తుంటారు.
పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యం మంచిదే. దాన్ని ఎవరూ కాదనలేరు.కాకుంటే.. ఎన్ని ఇళ్లు ఇచ్చినా.. ఇంకా ఇవ్వాల్సిన వారు వస్తూనే ఉంటారు. ఈ విషయం సీనియర్ అయిన చంద్రబాబుకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉచిత ఇళ్లతో వచ్చే సమస్య ఏమంటే.. అడిగేటోళ్లు యాభై మంది ఉంటే.. ప్రభుత్వం ఇచ్చేది ఐదుగురు లేదంటే ఆరుగురు మాత్రమే ఉంటారు. భారీగా ఖర్చుచేసి ఇంటి యజమానిని చేసిన దాని కంటే.. ఇళ్ల కేటాయింపులో తమకు దక్కని లబ్థిదారుల ఆగ్రహమే ఎక్కువగా ఉంటుంది.
భారీగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పథకం గురించి వివరాలు చెప్పేటప్పుడు ఉండే ఉత్సాహం.. వాటిని పూర్తి చేసి కేటాయింపులు చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలు.. వచ్చే వ్యతిరేకత గురించి చంద్రబాబుకు అవగాహన లేకుండా ఏమీ ఉండదు కదా? పదేళ్లు నాన్ స్టాప్ అధికారాన్ని వెలగబెట్టిన కేసీఆర్ సైతం.. తన కలల పథకమైన డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ఆయన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు.. వ్యతిరేకతను ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటిది చంద్రబాబు మళ్లీ ఇదే ఇళ్ల గురించి తాజాగా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారటమే కాదు.. సీనియర్ అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. మరో నెలలో 3 లక్షల కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తాయని చెప్పిన చంద్రబాబు.. ఇళ్లు లేని పేదల్ని గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పేదలకు ఉచిత ఇళ్ల నిర్మాణానికి ఏడాదిలో రూ.2013 కోట్లు ఖర్చు చేసినట్లుగా చంద్రబాబు చెప్పారు. మొత్తం పది లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలనే లక్ష్యంలో వచ్చే నెలలో 3 లక్షలు.. సంక్రాంతి నాటికిమరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని చెబుతున్నారు. ఉచిత ఇళ్ల నిర్మాణంతో వచ్చే సమస్య..కేటాయింపుల్లో తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లబ్థిదారుల ఎంపికలో గందరగోళంతో పాటు.. రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇలాంటి వాటిపై ఫోకస్ కంటే రాజధాని అమరావతిలో మౌలిక వసతులు.. ప్రభుత్వ.. ప్రైవేటు వర్గాల వారు భారీగా నిర్మాణాలు చేపట్టేలా నిర్ణయాలు తీసుకుంటే.. ప్రభుత్వానికి మరింతమైలేజీ పెరుగుతుంది. అదే సమయంలో పలు కార్యక్రమాల మీద ఫోకస్ చేసే కన్నా... ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని అందుకు తగ్గట్లు ముందుకువెళితే మంచిది. కానీ.. ఈ విషయాల్లో ఎప్పటిలానే చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న వేళలో చేసిన తప్పులే మళ్లీ రిపీట్ చేస్తున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.