పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు చెప్పాలనుకున్నది చెప్పిన చంద్రబాబు!

ఈ సందర్భంగా.. ప్రధానంగా శాసనసభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.;

Update: 2025-06-29 23:30 GMT
పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు చెప్పాలనుకున్నది చెప్పిన చంద్రబాబు!

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని నెలల నుంచీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతున్నాయని.. లిక్కర్ సిండికెట్లు, ఇసుక తవ్వకాళ్లో వారు కల్పించుకుంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని.. అలాంటివారు పద్దతి మార్చుకోవాలని చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సూచించారు. ఈ సమయంలో మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు.

అవును... తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం మొదలైంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ ఛార్జులు, పరిశీలకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా.. ప్రధానంగా శాసనసభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా... వైసీపీ పాలనతో రాష్ట్రం ధ్వంసమైందని.. ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామనే విషయం ప్రజలకు చెప్పామని చెప్పిన చంద్రబాబు.. వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కూటమి పాలనలోని ఐదేళ్లలో ఏం చేయాలనేదానిపై ఇప్పటికే చర్చించామని.. ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ప్రజల ఆకాంక్షలను మనం నెరవేర్చాలని.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అది మన అందరి బాధ్యత అని చంద్రబాబు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

ఇదే సమయంలో... తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి, నేతల పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నానని.. అదేవిధంగా అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని చెప్పిన చంద్రబాబు... అన్ని సర్వేలను విశ్లేషించి, వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నాని ప్రకటించారు.

ఈ క్రమంలో రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నానని పేర్కొన్న సీఎం... ఎమ్మెల్యేలకు తాను చెప్పాల్సింది చెబుతున్నానని, వారి పనితీరు మారాలని తేల్చి చెప్పారు. అలా చెప్పినట్లుగా పనితీరు మార్చుకుంటే బాగుంటుందని.. అలా కాని పక్షంలో ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి, ప్రజలకు ఇబ్బందిగా మారితే ఎవరికైనా నమస్కారం చెబుతానని హెచ్చరించారు!

Tags:    

Similar News